పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే.. ప్రతి అడుగులోను విద్యార్థుల భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నాం. ప్రతీ ఒక్కరూ బాగా చదువుకోవాలనేది నా తాపత్రాయం. అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. జగనన్న విద్యా దీవెన రెండో విడత సొమ్మును ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.693.81 కోట్లను విడుదల చేశారు.
నిరుపేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో, బకాయిలు లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నారు. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే ఆ పిల్లల తల్లులకే చెల్లించి, వారే కాలేజీలకు ఫీజులు కట్టేలా చేసి పేదల ఇంట విద్యా జ్యోతులు వెలిగిస్తున్నారు.
విద్యా దీవెన రెండో విడత సొమ్ము విడుదల కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. జగనన్న విద్యా దీవెన అనే మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తల్లిదండ్రులకు భారం లేకుండా విద్యాదీవెన అమలు చేస్తున్నాం. దేవుడి ఆశీస్సులతోనే ఇదంతా చేయగల్గుతున్నాం. ప్రతి పేద విద్యార్థికి చదువు అందుబాటులోకి రావాలన్నదే మా ప్రభుత్వం లక్ష్యం. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థుల భవిష్యత్తు కోసం 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నాం అన్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం మన దగ్గర 33శాతం నిరక్షరాస్యత ఉంది. బ్రిక్స్ దేశాలతో పోలిస్తే మన దేశంలో.. ఇంటర్ తర్వాత డ్రాప్ అవుట్స్ సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితిని మార్చడం కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టాం. తల్లిదండ్రులకు భారం లేకుండా వసతి దీవెన అందిస్తున్నాం. ప్రతి మూడు నెలలకోసారి తల్లుల ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తున్నాం. తల్లులే నేరుగా ఫీజులు చెల్లించేలా చర్యలు తీసుకున్నాం. విద్యా దీవెనతో ఇప్పటివరకు రూ.5,573 కోట్లు అందించాం. అమ్మఒడి, విద్యాకానుక, మనబడి నాడు-నేడు కింద..మొత్తం రూ.26,677 కోట్లు ఖర్చు చేశాం అని సీఎం జగన్ తెలిపారు.
విద్యా దీవెన మొదటి విడత ఏప్రిల్‌లో, రెండో విడత ఇవాళ, మూడో విడత డిసెంబర్‌లో, నాలుగో విడత ఫిబ్రవరిలో చెల్లిస్తున్నాం. విద్యారంగంలో ఇప్పటివరకూ మనం చేసిన ఖర్చు ఈ రెండు సంవత్సరాల కాలంలోనే జనగనన్న అమ్మ ఒడి ద్వారా 44,48,865 మంది తల్లులకు రూ.13,022 కోట్ల రూపాయలు జమచేశాం.
విద్యాదీవెన ద్వారా 18,80,934 మందికి రూ. 5,573 కోట్ల రూపాయలు, జగనన్న వసతి దీవెన ద్వారా 15,56,956 మందికి రూ. 2,270 కోట్ల రూపాయలు, జగనన్న గోరుముద్ద ద్వారా 36,88,618 మందికి రూ.1600 కోట్లు, జగనన్న విద్యా కానుక ద్వారా 47,00,000 మందికి రూ.647 కోట్ల రూపాయలు, మనబడి నాడు – నేడు కింద తొలి దశలో రూ. 3564 కోట్లు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఖర్చుచేశామని సీఎం వివరించారు