ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి కృష్ణపట్న గ్రామానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఓ లేఖ రాశారు. ప్రభుత్వం సహకరిస్తే తాను తయారు చేసే కరోనా మందును ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తానని అందులో పేర్కొన్నారు.
అలాగే, ఇప్పటికిపుడు ఒక్కో జిల్లాకి అయిదు వేల మందు ప్యాకెట్లు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయించాలని ఆనందయ్య ఆ లేఖలో కోరారు. అలాగే ఔషదం తయారీకి అవసరమైన సామగ్రి తదితరాలకు సహకారం అందించాలని కోరారు. ఎక్కువ మొత్తంలో మందు తయారు చేసి ఇతర రాష్ట్రాలకు సైతం పంపిస్తామని ఆనందయ్య తెలిపారు.
మందు తయారీకి విద్యుత్ సౌకర్యం ఉన్న కేంద్రం ఏర్పాటు చేయాలని ఆనందయ్య లేఖలో కోరారు. సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. సోమవారం ఆనందయ్య అందించే కె మందు పంపిణీకి సైతం హైకోర్టు అనుమతి ఇచ్చింది.
మంగళవారం నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు, పొదలకూరు మండలాల్లో మందు పంపిణీ చేయనున్నారు. గ్రామ వలంటీర్ల సహాయంతో ఆనందయ్య మందును ఇంటింటికీ పంపిణీ చేయించనున్నారు.