కరోనా కష్టకాలంలో ప్రపంచానికి భారత్ ఆపద్బాంధవుడుగా కనిపిస్తోంది. అనేక దేశాలకు ఆపన్న హస్తం అందిస్తోంది. భారత్‌లో తయారైన కరోనా వ్యాక్సిన్ టీకాలు ప్రపంచ దేశాలకు నిరంతరాయంగా సరఫరా అవుతున్నాయి. ఈ టీకాల కోసం అనేక అగ్రరాజ్యాలు భారత్ సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ, దాయాది దేశం పాకిస్థాన్ మాత్రం భారత్ సాయాన్ని స్వీకరించేందుకు ఆసక్తి చూపలేదు. కానీ, తమ దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఇపుడు మరోమార్గం లేక మెట్టుదిగింది. భారతదేశంలో తయారైన కరోనా టీకాలను దిగుమతి చేసుకునేందుకు సమ్మతించింది.
ఇప్పటికే అంతర్జాతీయ సమాజంలో భారత్ తన సౌభ్రాతృత్వాన్ని చాటుకున్న విషయం తెల్సిందే. అలాగే, భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య కాశ్మీర్ విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ.. ఆ దేశానికి కూడా ఇతర దేశాల తరహాలోనే సాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది.
కరోనా మహమ్మారిపై పోరులో పాక్‌కు 4.5కోట్ల స్వదేశీ కొవిడ్ టీకాలను పంపించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గవీ ఒప్పందంలో భాగంగా భారత్ 45 మిలియన్ల స్వదేశీ కొవిడ్ టీకాలను పాక్‌కు సరఫరా చేయనుంది. ఇందులో 1.6కోట్ల డోసులను ఈ ఏడాది జూన్ నాటికి డెలివరీ చేయనున్నట్లు తెలుస్తోంది.
"మానవతా దృక్పథంలో పాక్‌కు సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది. దీనిపై త్వరలోనే అధికారికంగా నిర్ణయం వెలువడనుంది"అని పేరు చెప్పడానికి నిరాకరించిన అధికారులు జాతీయ మీడియా సంస్థలకు వెల్లడించారు. సీరమ్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న టీకాలను పాక్‌కు పంపనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకా అత్యవసర వినియోగానికి పాక్ ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే.