దేశంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకునే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తాజా లెక్కల ప్రకారం ఈ టీకాలు వేయించుకున్న వారి సంఖ్య 2.3 కోట్లు దాటిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. సోమవారం ఒక్క రోజే సుమారు 20 లక్షల మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొత్త మైలురాయిని చేరుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొన్నది.
ఇదిలావుంటే, టీకాలు తీసుకున్న వారికి అమెరికా ప్రభుత్వం కొత్త సూచనలు చేసింది. వ్యాక్సినేషన్ సంపూర్ణంగా ముగిసిన వారు.. ఇండోర్స్‌లో చాలా స్వల్ప స్థాయిలో సమావేశాలకు హాజరుకావచ్చని పేర్కొంది. అయితే టీకా తీసుకున్నవారితోనే ఆ సమావేశాలు నిర్వహించాలన్నట్లు తెలిపింది.
అనవసరమైన ప్రయాణాలను ఎట్టిపరిస్థితుల్లో కొనసాగించవద్దు అని బైడెన్ ప్రభుత్వం పేర్కొన్నది. కరోనావైరస్ ఉదృతిని అడ్డుకునేందుకు అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తాజా మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.
పూర్తి స్థాయిలో టీకాలు తీసుకున్న వారు.. వ్యాక్సిన్ తీసుకోనివారితోనే కలవచ్చు అని పేర్కొన్నది. కానీ మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి. అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని, మరోసారి వైరస్ ఉదృతిని అడ్డుకోవాలంటే, సీడీసీ మార్గదర్శకాలను పాటించాలని బైడెన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.