గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ చెరసాలలో మగ్గుతున్న నేవీ రిటైర్డ్ అధికారి కుల్ భూషణ్ జాదవ్‌ను కలుసుకునేందుకు భారత కాన్సులేట్ (దౌత్యాధికారులు) అధికారులకు పాకిస్థాన్ సర్కారు అనుమతి ఇచ్చింది. ఇటీవల అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పు దరిమిలా పాకిస్థాన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
తమ భూభాగంలో గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ కుల్ భూషణ్ జాదవ్‌ను పాకిస్థాన్ సైనికులు గత 2017లో అదుపులోకి తీసుకున్నాయి. ఆ తర్వాత వివిధ రకాలుగా విచారణ అనంతరం ఆయనకు పాకిస్థాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధించింది. అయితే, ఈ వ్యవహారాన్ని భారత్ అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లగా, ఇటీవలే విచారణ జరిపిన న్యాయస్థానం కుల్ భూషణ్‌కు విధించిన మరణశిక్షను మరోసారి సమీక్షించాలంటూ పాక్‌ను ఆదేశించింది.
అంతేకాకుండా, జైల్లో మగ్గుతున్న కుల్‌భూషణ్‌ను కలుసుకునేందుకు ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులను అనుమతించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో కుల్ భూషణ్‌ను కలిసేందుకు భారత్‌కు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం పాక్ జైల్లో ఉన్న కుల్ భూషణ్‌ను భారత దౌత్యాధికారులు కలవనున్నారు. ఈ సందర్భంగా కుల్ భూషణ్‌కు న్యాయసహాయం అందించే అంశాలపై అధికారులు మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.