Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్‌లో బంగారం పంట... సింధు నదిలో పసిడి నిల్వలు!!

Advertiesment
gold reserves

ఠాగూర్

, ఆదివారం, 12 జనవరి 2025 (12:55 IST)
పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న పాకిస్థాన్‌లో బంగారం పంటపండింది. ఆ దేశంలోని సింధు నదిలో పుష్కలంగా బంగారు గనులు ఉన్నట్టు తాజాగా గుర్తించారు. పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌ ఆటోక్ జిల్లాలో ఉన్న సింధూ నది లోయలో ఈ బంగారం నిల్వలను గుర్తించారు. దాదాపు 32.6 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని, వాటి విలువ దాదాపు రూ.18 వేల కోట్లు (600 బిలియన్ పాకిస్థానీ రూపాయలు) ఉంటుందని అంచనా వేశారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్థాన్ (జీఎస్పీ) కూడా ఆ వివరాలను ధృవీకరించింది. 
 
పాకిస్థాన్‌ దేశంలో ఓ వైపు నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు కొండెక్కి ప్రజల జీవితం భారంగా మార్చాయి. మరోవైపు వరుస ఉగ్రదాడులతో ఎంతోమంది ప్రజలు, సైనికులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం నిల్వలు బయటపడ్డాయనే వార్త భవిష్యత్తుపై పాకు కొత్త ఆశలను రేకెత్తించింది.
 
ఈ బంగారం నిల్వలను వెలికితీత ప్రక్రియ మొదలైతే పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కొత్త రెక్కలు తొడిగేందుకు ఆస్కారం ఉంది. దేశంపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు బాటలు పడతాయి. పాక్ కరెన్సీ విలువ కొంతమేర బలోపేతం అవుతుంది. వెరసి నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు దిగొచ్చి సామాన్య ప్రజలకు ఊరట లభిస్తుంది. 
 
మరోవైపు, ఆటోక్ జిల్లాలోని సింధు నదిలో బంగారం నిల్వలను వెలికితీసే ప్రక్రియను ప్రారంభించడంపై పూర్తి దృష్టి పెట్టామని పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ ప్రకటించారు. 32 కిలోమీటర్ల పరిధిలో బంగారం నిల్వలు విస్తరించి ఉన్నాయని ఆయన తెలిపారు. పంజాబ్ ప్రావిన్స్, ఖైబర్ ఫంబూన్వా ప్రావిన్స్ పరిధిలోని పలు ఇతర ప్రాంతాల్లో కూడా బంగారం నిల్వలను గుర్తించామన్నారు. పెషావర్ బేసిన్, మర్డాన్ బేసిన్‌లో సైతం బంగారం నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌పై నిషేధం అమలవుతుందని ఇబ్రహీం హసన్ మురాద్ తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే బంగారు గనుల్లో మైనింగ్ జరుగుతుందని స్పష్టంచేశారు.
 
ఇదిలావుంటే, సింధు నది పాకిస్థాన్ మీదుగా ప్రవహించి హిమాలయాల్లోకి చేరుతుంటుంది. సింధు నది, హిమాలయాల దిగువన టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఆ చర్యల వల్లే అక్కడ బంగారం అణువులు ఏర్పడుతుంటాయి. అవి సింధు నది ప్రవాహం ద్వారా పాకిస్థాన్‌లోని నదీ పరివాహక ప్రాంతం పరిధిలో వ్యాపిస్తుంటాయి. వందల ఏళ్లతరబడి నిరంతరాయంగా సింధు నది ప్రవాహం జరిగిన ఫలితంగా, ఈ బంగారం అణువులన్నీ నదీ లోయలో పలుచోట్ల పేరుకుపోయి, బంగారు నిక్షేపాలుగా ఏర్పడివుంటాయని పేర్కొంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుస్తకాల పురుగు పవన్ కళ్యాణ్ : రూ.లక్షల విలువ చేసే పుస్తకాలు కొన్న డిప్యూటీ సీఎం