జమ్ముకాశ్మీర్‌లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ)కి ఆవల శిక్షణ తీసుకున్న 300 నుంచి 400 మంది పాక్ ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె పేర్కొన్నారు.
ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన.. దాదాపు 44 శాతం పెరిగిందని అన్నారు. ఉల్లంఘనకు పాల్పడినప్పుడల్లా కౌంటర్ ఇస్తూనే ఉన్నామని, ఉగ్రవాదులు చనిపోతూనే ఉన్నా...చొరబాట్లకు ప్రయత్నిస్తూనే ఉన్నారని అన్నారు.
గత ఏడాది ఆర్మీ జరిపిన ఉగ్రవాద నిరోధక చర్యల్లో 200 మందికి పైగా చనిపోయారని, ఈ చర్యలు జమ్ముకాశ్మీర్ ప్రజలకు ఉపశమనం కలిగించాయని అన్నారు. డ్రోన్లు, సొరంగాలు తవ్వి..దేశంలోకి ఆయుధాల అక్రమ రవాణాకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
భారత్ సైన్యం తమ పోరాట సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు ఆధునీకరణకు కృషి చేస్తోందని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, క్వాంటమ్ కంప్యూటింగ్, మానవ రహిత వ్యవస్థలు, డ్రోన్లు వంటి సాంకేతిక అభివృద్ధి కోసం ఐఐటి వంటి విద్యా సంస్థలతో కలిసి పనిచేస్తుందని అన్నారు.