అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడిన లష్కర్ ఏ తోయిబా అధినేత మసూద్ అజర్‌పై చర్యలకు పాకిస్థాన్ ఉపక్రమించింది. పలు దేశాలకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ముద్రపడిన మసూద్ అజర్, అంతర్జాతీయ ఉగ్రవాదేనని ఐక్యరాజ్యసమితి ప్రకటించిన విషయం తెల్సిందే. దీనికి చైనా కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
దీంతో పాకిస్థాన్ చర్యలకు దిగింది. ఇందులోభాగంగా, మసూద్ ఆస్తులను జప్తు చేయాలని, ఆయన ఎటువంటి ఆయుధాల కొనుగోలు, అమ్మకాలు జరపరాదని ఆంక్షలు విధిస్తూ, అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆంక్షల కమిటీ విధించే నిబంధనలకు అనుగుణంగా మసూద్‌పై చర్యలు ఉంటాయని ఈ నోటిఫికేషన్‌లో పాకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది.
మసూద్ విదేశీ ప్రయాణాలపైనా నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. భద్రతా మండలి నిర్ణయాన్ని తాము ఆమోదిస్తున్నామని, నిబంధనల మేరకు ఆంక్షలను తక్షణమే అమలు చేయనున్నామని పేర్కొంది.
కాగా, మసూద్‌ను ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాల్సిందేనంటూ అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాలు భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆపై చైనా కూడా అభ్యంతరం తెలపకపోవడంతో రెండు రోజుల క్రితం మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ నిర్ణయం వెలువడింది.