రష్యాలో కరోనా విలయతాండవం చేస్తోంది. కోవిడ్ కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అక్టోబర్ 30 నుంచి వారం పాటు వేతనంతో కూడిన సెలవులను ఇస్తున్నట్టు ప్రకటించారు.
దీని ప్రకారం ఉద్యోగులెవ్వరూ ఆఫీసులకు వెళ్లాల్సిన పనిలేదు. పైగా ఆ వారం పాటు ప్రజలు ఎవరి ఇళ్లలో వాళ్లు ఉంటూ మహమ్మారి అంతానికి సహకరించడంతో వారి జీతం కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.
కరోనా కట్టడి కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని పుతిన్ పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ తీసుకోవడాన్ని ఓ బాధ్యతగా చూడాలన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ రష్యానే కనిపెట్టినప్పటికీ అక్కడి పౌరులు వ్యాక్సిన్ వేసుకోవడానికి అంతగా సుముఖంగా లేరు.
దీంతో వ్యాక్సినేషన్ నత్త నడకన సాగుతోంది. గడిచిన 24 గంట్లలో రష్యాలో కొత్తగా 34,074 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా సగటున రోజుకు 1000 కరోనా మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో రష్యాలో 1,028 మంది మరణించారు.