అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారిగా గుర్తించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)ను ఉగ్ర సంస్థగా ప్రకటించింది. ఇది పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. మరో నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా సంస్థ ముసుగు సంస్థగా దీన్ని అమెరిగా గుర్తించి ఉగ్రసంస్థగా ప్రకటించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'మా జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, పహల్గాం దాడికి న్యాయం కోసం అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. ఇదే మా పరిపాలన నిబద్ధతను చెబుతోంది' అని రూబియో తెలిపారు.
'ది రెసిస్టెంట్ ఫ్రంట్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రత్యేకంగా నియమితమైన గ్లోబల్ టెర్రరిస్ట్ (SDGT) ఆర్గనైజేషన్‌గా అమెరికా గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. 2008 ముంబై ఉగ్రదాడి తర్వాత భారత్‌లో చోటుచేసుకున్న దాడుల్లో పహల్గామ్ ఘటనే అతిపెద్దదని అధికారిక ప్రకటనలో మార్క్ రూబియో వెల్లడించారు. భారత భద్రత దళాలపై గతంలో జరిగిన పలు దాడులకు టీఆర్ఎఫ్ బాధ్యత వహించిందని పేర్కొన్నారు.
కాగా, అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. "ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్-అమెరికా బలమైన సహకారానికి మరో నిదర్శనం ఇది. ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటిస్తూ అమెరికా విదేశాంగ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాం. టీఆర్ఎఫ్ అనేది లష్కరే ముసుగు సంస్థ. పహల్గాంలో అనేక మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంది. ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించకూడదు" అని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.