ఉత్తర కొరియా మరోమారు ఖండాంతర్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పటికీ ఉత్తర కొరియా తన సైనిక శక్తిని ప్రదర్శించడంలో ఏమాత్రం తగ్గడం లేదు. రష్యా, చైనా వంటి అగ్రరాజ్యాల మద్దతుతో మరింత ధీమాగా కనిపిస్తున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్, తాజాగా తన అమ్ములపొదిలోని అత్యంత శక్తిమంతమైన ఆయుధాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు.
అధికార వర్కర్స్ పార్టీ 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ప్యాంగ్యాంగ్‌లో భారీ స్థాయిలో నిర్వహించిన సైనిక కవాతులో ఈ ఆయుధ ప్రదర్శన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి రష్యా, చైనాలకు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధులు హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ భారీ సైనిక కవాతులో 'హ్వాసోంగ్-20' అనే సరికొత్త ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని (ఐసీబీఎం) ఉత్తర కొరియా ప్రదర్శించింది. దీనిని తమ వద్ద ఉన్న 'అత్యంత శక్తిమంతమైన అణ్వస్త్ర వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థ'గా అక్కడి ప్రభుత్వ మీడియా అభివర్ణించింది. ఈ క్షిపణితో పాటు సుదూర లక్ష్యాలను ఛేదించే క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్ లాంచ్ వాహనాలు, భూమి నుంచి గగనతలానికి, భూమి నుంచి భూమికి ప్రయోగించే ఇతర క్షిపణులను కూడా కవాతులో ప్రదర్శించారు.
ఈ సందర్భంగా కిమ్ జాంగ్ ఉన్ మాట్లాడుతూ, తమ సైన్యం అజేయమైనదని, దేశ భవిష్యత్తు కోసం పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు రెట్టింపు బలాన్ని ఇస్తోందని అన్నారు. అంతర్జాతీయ న్యాయం కోసం విదేశీ యుద్ధ క్షేత్రాల్లో తమ దళాలు ప్రదర్శిస్తున్న వీరోచిత పోరాట స్ఫూర్తి అద్భుతమని ఆయన పరోక్షంగా ఉక్రెయిన్‌లో రష్యా తరపున పోరాడుతున్న ఉత్తర కొరియా సైనికులను ఉద్దేశించి ప్రశంసలు కురిపించారు. రష్యా కోసం పోరాడుతూ దాదాపు 600 మంది ఉత్తర కొరియా సైనికులు మరణించారని, వేలమంది గాయపడ్డారని దక్షిణ కొరియా గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే.