రెచ్చగొట్టే చర్యలను ఉపేక్షించం : జపాన్ ప్రధాని షింజో అబే
ఉత్తర కొరియా తమ దేశం మీదుగా క్షిపణి ప్రయోగాలు జరుపడంపై జపాన్ తీవ్రంగా స్పందించింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ దుందుడుకు వైఖరిని, రెచ్చగొట్టే చర్యలను ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని
ఉత్తర కొరియా తమ దేశం మీదుగా క్షిపణి ప్రయోగాలు జరుపడంపై జపాన్ తీవ్రంగా స్పందించింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ దుందుడుకు వైఖరిని, రెచ్చగొట్టే చర్యలను ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ప్రధాని షింజో అబే తేల్చిచెప్పారు. ఇదే విషయం ఉత్తరకొరియాకు అర్థమయ్యేలా తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు.
కాగా, శుక్రవారం ఉత్తరకొరియా క్షిపణి పరీక్షతో జపాన్ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఎరిమో, హొక్కైడో నగరాల ప్రజలు అప్పుడే నిద్రలేచి ఎవరిపనుల్లో వారు నిమగ్నమై ఉండగా, హైఅలర్ట్ సైరన్లు మోగాయి. ఫోన్లకు ఎమెర్జెన్సీ మెసేజ్‌లు వచ్చాయి. టీవీ చానళ్లు హెచ్చరికలను ప్రసారం చేశాయి. క్షిపణి రాకను జపాన్ రాడార్లు పసిగట్టడంతో ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తం చేసింది. హతాశులైన ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు.
జపాన్ భూభాగం మీదుగా ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం జరుపడం నెలరోజుల్లో ఇది రెండోసారి. ఆగస్టు 29న కూడా జపాన్‌ను ఉత్తరకొరియా తన హ్వసాంగ్-12 క్షిపణితో ఇలాగే వణికించింది. శుక్రవారం ప్రయోగించిన క్షిపణి భూఉపరితలానికి 770 కి.మీ.ల ఎత్తున 3700 కి.మీ.ల దూరం ప్రయాణించిందని దక్షిణ కొరియా రక్షణశాఖ వెల్లడించింది. దీనికి ప్రతిగా దక్షిణ కొరియా సైన్యం తమ భూభాగంలో క్షిపణి విన్యాసాలను చేపట్టింది. హ్యున్ము క్షిపణులను 250 కి.మీ.ల దూరం వరకు పరీక్షించామని ప్రకటించింది.
మరోవైపు. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షను తాము ఖండిస్తున్నట్లు చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ తెలిపారు. ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను సంపూర్ణంగా అమలు చేయాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు.