ఆప్ఘనిస్థాన్ దేశాన్ని తమ వశం చేసుకున్న తాలిహన్ తీవ్రవాదులు ఆ దేశంలో కఠినమైన షరియా చట్టాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం ఆ మేరకు సంకేతాలు పంపించింది. ఈ నేపథ్యంలో ఆప్ఘన్ కొత్త విద్యా మంత్రి షేక్ మౌల్వీ నూరుల్లా మునీర్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ పీహెచ్‌డీలు, మాస్టర్ డిగ్రీలు ఎందుకూ పనికి రావని కామెంట్ చేయడం గమనార్హం.
ముల్లాలకు ఆ డిగ్రీలేమైనా ఉన్నాయా? అయినా వాళ్లే అందరి కంటే గొప్పవాళ్లు అని నూరుల్లా అన్నాడు. ఇప్పుడు ఏ పీహెచ్‌డీ డిగ్రీకి, మాస్టర్ డిగ్రీకి విలువ లేదు. ముల్లాలు, తాలిబన్ లీడర్లకు ఈ డిగ్రీలు కాదు కదా కనీసం హైస్కూల్ డిగ్రీ కూడా లేదు. కానీ వాళ్లే ఇప్పుడు గొప్పవాళ్లు అని అతడు అన్నాడు.
ముల్లా హసన్ ప్రధానిగా మంగళవారం తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఓ ఉగ్రవాది సహా 33 మంది మంత్రులు తాలిబన్ల కేబినెట్‌లో ఉన్నారు. షరియా చట్టం ప్రకారమే తమ పాలన ఉంటుందని వాళ్లు ఇప్పటికే స్పష్టం చేయడం గమనార్హం.