న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్‌లో ఇటీవల జరిగిన జాత్యహంకార దాడిలో అనేక మంది మరణించారు. ఆస్ట్రేలియా దేశస్థుడు బ్రెంటన్ టరెంట్ ఈ దాడికి పాల్పడ్డాడు. ఆ దాడిలో 50 మంది మరణించగా ఫిజికి చెందిన 16 ఏళ్ల బాలుడు ముస్తఫా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో మృతుల సంఖ్య 51కి చేరుకుంది.
ప్రస్తుతం న్యూజిలాండ్‌లో మరణశిక్ష రద్దు కావడంతో నేరస్థునికి జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 1961లో మరణ శిక్షను రద్దు చేసిన తర్వాత హత్య చేయడానికి గల ఉద్దేశ్యం, తీరును బట్టి కనీసం 10 ఏళ్ల జైలు శిక్షను విధిస్తున్నారు. 2001లో విలియం బెల్ అనే వ్యక్తి ముగ్గురిని చంపగా అతనికి ముప్ఫై సంవత్సరాల కారాగార శిక్ష విధించారు.
న్యూజిలాండ్‌లో ఇప్పటివరకు ఇదే అత్యధిక జైలుశిక్ష. దీనితో ఈ కేసులో దర్యాప్తు అధికారులు నిందితునిపై 51 వేర్వేరు కేసులు మోపనున్నారు. ఈ ప్రకారం నిందితుడు 51 మందిని చంపాడు కాబట్టి అతనికి 510 ఏళ్లు శిక్షపడే అవకాశం ఉంది. ఈ నేరం తీవ్రత దృష్ట్యా నిందితునికి అప్పీలు చేసుకునే అవకాశం ఉండదని, పెరోల్ సదుపాయం కూడా ఉండదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.