పెళ్లి పీటలపై నుంచి కటకటాల వెనక్కి! ఎందుకు? ఎక్కడ?

గురువారం, 9 ఏప్రియల్ 2020 (10:01 IST)
ఎన్నో ఊహలతో పెళ్లి పీటలెక్కింది ఓ జంట. ఇక స్వర్గపుటంచుల వరకూ వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందుకు పెద్దల ఆశీస్సులు, తోటివారి సలహాలు తీసుకుంది. కానీ ఇంతలోనే పోలీసులు వచ్చి బెడ్రూం లోకి వెళ్లాల్సిన ఆ జంటను జైలుకు తీసుకెళ్లి పోయారు.

దక్షిణాఫ్రికాలో ఈ ఘటన జరిగింది. ఇందుకు కరోనా లాక్ డౌన్ కారణమైంది. వివరాల్లోకి వెళితే... 48 ఏళ్ల జబులాని జులు అనే వ్యక్తి  నొమ్తాండాజొ మెక్ జీ (38)ని వివాహం చేసుకున్నాడు. క్వాజులు- నటాల్ అనే ప్రాంతంలో ఈ పెళ్లి జరిగింది.

అయితే కరోనా నేపథ్యంలో ప్రజలు గుమికూడడంపై అక్కడ నిషేధం ఉంది. అయినా.. జులు, మెక్‌ జీ పెళ్లి వేడుక జరుగుతున్న విషయం తెలియడంతో ఆయుధాలు ధరించిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వేడుకను నిలిపివేసి వధూవరులతో పాటు పెళ్లికి వచ్చిన యాభై మందికి పైగా కుటుంబ సభ్యులు, అతిథులను అరెస్ట్ చేశారు.

అందరినీ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి.. ఒక్కొక్కరికి రూ. 4100 పూచికత్తుతో బెయిల్ ఇచ్చారు. కాగా, దక్షిణాఫ్రికాలో ఇప్పటిదాకా 1700 పైచిలుకు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ దేశంలో ఈనెల 16 వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మూడు నెలలు గ్యాస్ సిలిండర్లు ఉచితం!