నువ్వూ.. నీ బాంబూ... ఇంకెవ్వరూ దొరకలేదా.. ఈసడించుకున్న హమీద్ కర్జాయ్
మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని చెబుతున్న పది టన్నుల బరువైన బాంబును ఆప్గన్ గడ్డపైన వేయడానికి మేమే దొరికామా అంటూ ఆప్ఘానిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ అమెరికాను ఈసడించుకున్నారు.
మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని చెబుతున్న పది టన్నుల బరువైన బాంబును ఆప్గన్ గడ్డపైన వేయడానికి మేమే దొరికామా అంటూ ఆప్ఘానిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ అమెరికాను ఈసడించుకున్నారు. ఈ బాంబు దాడి ఉగ్రవాదం మీద యుద్ధంలో భాగం కాదని, అమెరికా తాను తయారు చేస్తున్న కొత్త, ప్రమాదకరమైన ఆయుధాలకు ఆప్గానిస్తాన్‌ను ప్రయోగ కేంద్రంగా ఉపయోగించుకుంటోందని, ఈ అమానవీయ చర్యను ఆపాల్సిన బాధ్యత ఆప్గాన్ ప్రజలమీదే ఉందని కర్జాయ్ పేర్కొన్నారు.
ఆయుధాల చరిత్రలో అతిపెద్ద బాంబును తయారు చేసి మదర్ ఆప్ ఆల్ బాంబ్స్ అని పేరు పెట్టిన అమెరికా దాన్ని రెండు రోజుల క్రితం అఫ్ఘానిస్థాన్ మీద ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 36 మంది ఐసిస్ ఉగ్రవాదులు మరణించినట్లు చెబుతున్నారు. అయితే, ఇదంతా కేవలం సాకు మాత్రమేనన్నది కర్జాయ్ భావనలా కనిపిస్తోంది.
అయితే అమెరికా మాత్రం ఐసిస్ ఉగ్రవాదులను అంతం చేయాలంటే ఈ పెద్ద బాంబు (ఎంఓఏబీ)ని ప్రయోగించడం ఒక్కటే మార్గమని అంటోంది. ఈ దాడిలో ఎంతమంది మరణించారన్న లెక్క తమకు కచ్చితంగా తెలియదని పెంటగాన్ చెబుతుంటే, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం ఇది చాలా చాలా విజయవంతమైన ప్రయోగమని అభివర్ణించారు.
అచిన్ ప్రాంతంలో ఐసిస్ ఉగ్రవాదులతో పోరాడుతున్న అఫ్ఘాన్, అమెరికన్ బలగాలకు ముప్పును వీలైనంత తగ్గించాలనే ఈ దాడి చేసినట్లు అమెరికా సైన్యం చెబుతోంది. ఈ బాంబు పేలుడు 11 టన్నుల టీఎన్‌టీ పేలుడుకు సమానమని సైనికరంగ నిపుణులు చెబుతున్నారు. పేలుడు వ్యాసార్థం దాదాపు మైలు పొడవుంటుందని కూడా అంటున్నారు.