ప్రపంచంలో కరోనా మహమ్మారి పెద్దదేం కాదని, భవిష్యత్తులో ఇంతకంటే తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాలు రానున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) తెలిపింది. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.
భవిష్యత్ మహమ్మారులను ఎదుర్కొనేందుకు కరోనా ప్రజలను సంసిద్ధుల్ని చేసిందని డబ్ల్యుహెచ్‌ఒ చీఫ్ టెడ్రోస్ అధనామ్ అన్నారు. అంటువ్యాధులపై మరింత అప్రమతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచమంతా ఏకమై కరోనా అంతమయ్యేలా చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
బ్రిటన్, దక్షిణాప్రికాలో కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా రకాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారని, ఎప్పటికప్పుడు నిర్థారణ పరీక్షలు చేస్తేనే కొత్త రకాల్ని గుర్తించగలమని అన్నారు.
కరోనా చాలా వేగంగా విజృంభించిందని, అనేకమందిని బలిగొందని డబ్ల్యుహెచ్‌ఒ అత్యవసర కార్యక్రమాల విభాగాధిపతి మైఖేల్ ర్యాన్ అన్నారు. అయితే భవిష్యత్తులో రాబోయే మహమ్మారులతో పోలిస్తే కరోనా మరణాల రేటు చాలా తక్కువగానే ఉండే అవకాశం ఉందని అన్నారు.
మరింత తీవ్రమైన అంటు వ్యాధులను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సన్నద్ధమవ్వాలని సూచించారు. కరోనా సమయంలోనే వేగవంతమైన నూతన ఆవిష్కరణలు, శాస్త్రవిజ్ఞాన ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయని డబ్ల్యుహెచ్‌ఒ సీనియర్ సలహాదారు బ్రూస్ ఇల్‌వర్డ్ గుర్తు చేశారు.
అయినప్పటికీ. భవిష్యత్ మహమ్మారులను ఎదుర్కొనేందేకు కావల్సిన సామర్థ్యాన్ని అందుకోవడంలో చాలా దూరం ఉన్నామని అన్నారు. కరోనా రోజురోజుకి రూపాంతరం చెందుతూ రెండు, మూడోదశలోకి ప్రవేశిస్తోందని గుర్తు చేశారు. వీటిని ఎదుర్కోవడానికి మనం సన్నద్ధంగా లేమని అన్నారు.