ఆ దంపతులు తన బిడ్డతో కలిసి సరదాగా టూర్ కోసం బయలుదేరారు. కానీ, విమానమెక్కిన తర్వాత వారికి చేదు అనుభవం ఎదురైంది. చెమట వాసన వస్తుందన్న కారణంతో విమానం నుంచి కిందికి దించేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
మిషిగాన్‌కు చెందిన యాదు వర్గానికి చెందిన దంపతులు యోసిన్ ఆడ్లర్, జెన్నీలకు తమ 19 నెలల వయసున్న పాపతో కలిసి మియామీకి వెళ్లేందుకు అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత గత బుధవారం ఈ ముగ్గురు విమానమెక్కారు. విమానమెక్కి తమ సీట్లలో కూర్చొన్న తర్వాత వారి నుంచి దుర్గంధభరితమైన చెమట వాసన వస్తుందంటూ తోటి ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.
దీంతో ఎమర్జెన్సీ పేరుతో వారిద్దరినీ విమానయాన సిబ్బంది కిందికి దించేశారు. ఆ తర్వాత ఎందుకని అడిగితే సమాధానం చెప్పకుండా తర్వాతి విమానంలో పంపిస్తామని సర్దిచెప్పారు. ఆ తర్వాత వారికి హోటల్‌లో ఉండేందుకు కూపన్లతో పాటు ఫుడ్ కూపన్లు ఇచ్చారు. ఈ కూపన్లను హోటల్ సిబ్బంది నిరాకరించారు. దీంతో ఆడ్లర్ ఎయిర్‌లైన్స్ అధికారులను నిలదీయగా అసలు విషయం బయటపడింది.