భారత్ - చైనా దేశాల మధ్య మీడియా వార్ మొదలైంది. భారతీయ జర్నలిస్టులంతా తమ దేశం వీడాలని చైనా హుకుం జారీచేసింది. కావాలని కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా మరోసారి తన బుద్ధి చాటుకుంది. సరిహదుల్లో భారత్‌తో గిల్లికజ్జాలు పెట్టుకునే డ్రాగన్ ఈసారి మీడియాను లక్ష్యంగా చేసుకుంది. కొన్ని నెలల కిందట మన మీడియా ప్రతినిధులకు ముగ్గురు సహాయకులే ఉండాలంటూ పరిమితి విధించిన బీజింగ్.. ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న ఏకైక భారతీయ జర్నలిస్టును జూన్ నెలాఖరులోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది.
కొద్దిరోజుల క్రితం జిన్హువా, చైనా సెంట్రల్ టీవీ జర్నలిస్టుల వీసా పొడిగింపును భారత్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో మన జర్నలిస్టులకు సహాయకుల సంఖ్యపై పరిమితి పెట్టిన డ్రాగన్, వారిని తామే ఎంపిక చేసి ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు భారతీయ జర్నలిస్టును వెళ్లిపోవాలని ఆదేశించింది. కాగా, చైనా ఆదేశాలతో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) విలేకరి త్వరలో వచ్చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఈ ఏడాది ప్రారంభం వరకు చైనాలో నలుగురు భారత జర్నలిస్టులు ఉండేవారు. హిందూస్థాన్ టైమ్స్ జర్నలిస్టు గత వారాంతంలో వచ్చేశారు. ప్రసారభారతి, హిందూ పత్రిక జర్నలిస్టులకు ఏప్రిల్లో వీసాలను పునరుద్ధరించలేదు. పీటీఐ ప్రతినిధిని కూడా వెళ్లిపోవాలని కోరడంతో పొరుగు దేశంలో మన జర్నలిస్టులు ఎవరూ లేనట్లవుతోంది.