ఇటీవల పందె గుండె అమర్చిన వ్యక్తి రోగి ప్రాణాలు కోల్పోయాడు. గుండె పనితీరు బాగాలేకపోవడంతో వైద్యులు ఓ రోగికి పందె గుండెను అమర్చారు. ఆ రోగి పేరు లారెన్స్ ఫాసెట్. వయసు 58 యేళ్లు. అమెరికా వైద్య నిపుణులు ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. కొద్ది రోజులు పాటు బాగానే ఉన్న ఆయన.. దురదృష్టవశాత్తు మరణించారు. వైద్యులు ఆపరేషన్ చేసిన 40 రోజుల తర్వాత ఆయన మృతిచెందారు.
కాగా, ఫాసెట్ గుండె పూర్తిగా విఫలంకావడంతో యూనివర్సిటీ ఆఫ్ మెరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వైద్యులు ప్రయోగాత్మకంగా సెప్టెంబర్ 20న ఫాసెట్‌కు ఆపరేషన్ నిర్వహించి పంది గుండెను అమర్చారు. మనిషికి అనుకూలంగా జన్యుమార్పిడి చేసిన పంది నుంచి ఈ గుండెను సేకరించారు.
ఈ ఆపరేషన్ జరిగిన తొలినాళ్లల్లో ఫాసెట్ ఆరోగ్యం వేగంగా మెరుగుపడిందని వైద్యులు వెల్లడించారు. కానీ, తర్వాతి రోజుల్లో పంది గుండెను ఫాసెట్ రోగనిరోధక వ్యవస్థ తిరస్కరించడం (ఆర్గాన్ రిజెక్షన్) ప్రారంభించిందని వెల్లడించారు.
ఆయనను కాపాడేందుకు తాము ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని విచారం వ్యక్తం చేశారు. గుండె మార్పిడి శస్త్రచికిత్స తర్వాత రోగులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఆర్గాన్ రిజెక్షన్ అన్న విషయం తెలిసిందే. ఈ సమస్యను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు అనేక కోణాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఫాసెట్‌కు కూడా ఇదే పరిస్థితి ఉత్పన్నం కావడంతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది.