కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా పలు రంగాలకు చెందిన వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు కూడా ఇంటి నుంచే వీడియో కాన్ఫరెన్సుల ద్వారా సమీక్షలు జరుపుతున్నారు. ఐతే ఇలాంటి సమయాల్లో కొన్ని విచిత్ర ఘటనలు ఎదురవుతున్నాయి.
తాజాగా బ్రెజిల్ దేశాధ్యక్షునికి ఓ చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. కరోనా కట్టడిలో భాగంగా అనుసరిస్తున్న లాక్‌డౌన్ ఫలితాలపై చర్చిందుకు సావో పాలో ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు పాలో స్కాఫ్ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో తో పాటు పది మంది ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.
ఇంతలోనే ఆ వీడియో కాల్‌లో ఓ వ్యక్తి నగ్నంగా ప్రత్యక్షమయ్యాడు. దీంతో షాకైన అధ్యక్షుడు జైల్.. పాలో... ఈ కాల్‌లో చివర్లో ఉన్న వ్యక్తి బాగానే ఉన్నాడు కదా?" అని అనుమానాన్ని వెలిబుచ్చారు. వెంటనే ఇతర అధికారులు సదరు వ్యక్తిని కాన్ఫరెన్స్ నుంచి తొలగించారు.
ఈ వీడియో కాల్‌లో నగ్నంగా కనిపించిన వ్యక్తి గురించి పరిశ్రమల శాఖ మంత్రి పాలో గ్యూడ్స్ మాట్లాడుతూ.. 'అతను నగ్నంగా స్నానం చేస్తున్నాడు. ఈ మీటింగ్ వేడి వేడిగా జరుగుతోంది. అందుకని అతను చన్నీళ్లతో స్నానం చేస్తున్నాడు" అని చమత్కరించారు.
కాగా ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఏప్రిల్‌లోనూ ఓ బ్రెజిల్ జడ్జి చొక్కా వేసుకోకుండా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే.