Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాల్దీవుల అధ్యక్షుడికి మరిన్ని చిక్కులు ... అభిశంసన తీర్మానం

Advertiesment
Mohamed Muizzu

వరుణ్

, మంగళవారం, 30 జనవరి 2024 (09:25 IST)
తన మంత్రివర్గంలోని ఇద్దరు సహచరులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు చేయడంతో చిక్కుల్లో పడిన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మయిజ్జుకు మరిన్ని సమస్యలు తలెత్తాయి. ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఆ దేశ పార్లమెంట్‌లో మెజార్టీ ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ (ఎండీపీ) సిద్ధమైంది. 
 
కేబినెట్లోకి కొత్తగా నలుగురు సభ్యులను తీసుకోడానికి ఆమోదం తెలిపే విషయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య పార్లమెంటులో ఘర్షణ జరిగిన తర్వాతి రోజే చైనా అనుకూల దేశాధ్యక్షుడిపై అభిశంసనకు ప్రధాన ప్రతిపక్షం సిద్ధం కావడం గమనార్హం. అభిశంసన తీర్మానానికి అవసరమైనన్ని సంతకాలను డెమొక్రాట్ల భాగస్వామ్యంతో ఎండీపీ సేకరించింది. 
 
పార్లమెంటులో మొత్తం 87 మంది సభ్యులుండగా, ప్రతిపక్ష ఎండీపీ, డెమొక్రాట్లకు సంయుక్తంగా 56 మంది సభ్యుల బలముంది. పార్లమెంటులో 56 ఓట్లతో దేశాధ్యక్షుడిని అభిశంసించవచ్చని రాజ్యాంగంతోపాటు, పార్లమెంట్ స్టాండింగ్ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సోమవారం ఎండీపీ పార్లమెంటరీ గ్రూప్ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించింది. 
 
కాగా, కొత్తగా కేబినెట్‌లోకి తీసుకోవాలనుకున్న నలుగురిలో ఒకరి నియామకానికి పార్లమెంటు సోమవారం ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి అలీ హైదర్ అహ్మద్ నియామకాన్ని 37-32 ఆధిక్యంతో పార్లమెంటు ఆమోదించిందని స్థానిక మీడియా తెలిపింది. గతేడాది జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో భారత అనుకూల ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ ఓటమి పాలయ్యారు. అనంతరం అధ్యక్ష పగ్గాలు చేపట్టిన చైనా అనుకూల ముయిజ్జు మార్చి 15 నాటికి తమ దేశం నుంచి సైనిక దళాలను ఉపసంహరించుకోవాలని భారత్‌ను కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇకపై అలా కుదరదు.. రిజర్వేషన్ చేసుకున్న స్టేషన్‌లో ఎక్కాల్సిందే...