Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సరిహద్దుల్లో నివురుగప్పిన నీరు : ఆరు ప్రాంతాలు భారత్ వశం

సరిహద్దుల్లో నివురుగప్పిన నీరు : ఆరు ప్రాంతాలు భారత్ వశం
, సోమవారం, 21 సెప్టెంబరు 2020 (08:51 IST)
భారత్ - చైనా దేశాల సరిహద్దుల్లో పరిస్థితి నివురు గప్పిన నీరులా వుంది. ఇదే క్రమంలో భారత్ మెల్లగా పట్టుసాధిస్తోంది. భారత భూభాగంలో ఖాళీగా ఉన్న ఆరు ప్రాంతాలను వశపరుచుకుంది. గతంలో చైనాతో సరిహద్దుల్లో ఆత్మరక్షణ ధోరణికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన భారత సైన్యం ఇటీవలి పరిణామాల నేపథ్యంలో దూకుడు పెంచింది. 
 
తాజాగా ఎల్ఏసీ వద్ద మరో 6 ప్రాంతాలను ఆక్రమించి చైనాను దిగ్భ్రాంతికి గురిచేసింది. గతంలో చైనా ఇదే తరహా వ్యూహాలు అమలు చేసి భారత ప్రభుత్వాన్ని, సైన్యాన్ని ఎంతో అసహనానికి గురిచేసేది. ఓవైపు చర్చలు జరుగుతున్న తరుణంలోనూ చైనా ఇదే తీరు కనబర్చేది.
 
కానీ, కేంద్రం సైన్యానికి స్వేచ్ఛ ఇస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భారత సైన్యం ఎల్ఏసీ వద్ద కీలక ప్రాంతాలపై పట్టు సాధించింది. ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు రెండో వారం వరకు ఆరు కీలక ప్రాంతాలపై భారత్ ఆధిపత్యం కనబర్చిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మగర్ హిల్, గురుంగ్ హిల్, రీసెహెన్ లా, రెజాంగ్ లా, మోఖ్ పారి, ఫింగర్ 4 పర్వత ప్రాంతాలను భారత్ వశపర్చుకుందని వివరించాయి.
 
ఈ ప్రాంతాలను తొలుత చైనా బలగాలు ఆక్రమించుకునే ప్రయత్నం చేశాయని, ఈ క్రమంలో మూడు సార్లు చైనా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయని, అయినప్పటికీ భారత సైన్యం మడమతిప్పలేదని ఓ అధికారి పేర్కొన్నారు.
 
నిజానికి పాంగాంగ్‌ ప్రాంతంలోని ఫింగర్‌-4 సమీపంలో ఉన్న అవన్నీ భారత్‌లోని భూభాగాలే అయినప్పటికీ, ఖాళీగా ఉన్నాయి. చైనా అక్కడ తిష్ట వేసే అవకాశం ఉన్నందున ముందుగా భారత బలగాలు అక్కడకు చేరుకుని స్థావరాలు ఏర్పాటు చేసినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. 
 
కాగా.. లఢక్‌ ప్రాంతంలో సు-30, ఎంకేఐ, జాగ్వార్‌, మిరేజ్‌ 2000 యుద్ధవిమానాల్ని భారత్‌ మోహరించిందని వార్తలు రావడంతో టిబెట్‌ అటానమస్‌ ప్రాంతం(టీఏఆర్‌)లో చైనా అప్రమత్తమైంది. ఈ మేరకు చైనా అధికారిక పత్రిక పీపుల్స్‌ డెయిలీ కథనాన్ని ప్రచురించింది. టిబెట్‌లోని లాసా నగరంలో వాయుదాడి జరిగితే ప్రజలు అప్రమత్తమయ్యేలా డ్రిల్స్‌ నిర్వహిస్తోందని తెలిపింది. 
 
ముఖ్యంగా, లాసాలోని గొంగర్‌ విమానాశ్రయ మౌలిక వసతుల్ని చైనా భారీగా ఆధునీకీకరించిన నేపథ్యంలో భారత్‌ ఈ ఎయిర్‌ పోర్టుపై దాడి చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. భారత్‌పై వేగంగా దాడి చేసేందుకు వీలుగా ఇక్కడే చైనా యుద్ధ విమానాలను మోహరిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లో ఘోరం.. చూస్తుండగానే నీటిలో కొట్టుకునిపోయాడు...