ఉత్తరకొరియా దేశాధీశులు కిమ్ జాంగ్ ఉన్, ఆయన సోదరి కిమ్ యో జాంగ్‌లకు ఏమైందో తెలియడం లేదు. ఒకరు మారిస్తే ఒకరు అదృశ్యమైపోతున్నారు. తొలుత కిమ్ జాంగ్ ఉన్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇపుడు ఆయన సోదరి కిమ్ యో జాంగ్ గత నెల రోజులుగా కనిపించడం లేదట.
నిజానికి హృద్రోగ ఆపరేషన్ తర్వాత కిమ్ జాంగ్ ఉన్న కోమాలోకి వెళ్లిపోయారని ఒకసారి, లేదులేదు ఆయన చనిపోయారంటూ మరోమారు రూమర్లు గుప్పుమన్నాయి. దీంతో ఆయన సోదరి కిమ్ యో జాంగ్‌కు సగం అధికారాలు కట్టబెట్టారని ఇంకోసారి కథనాలు వెలువడ్డాయి.
కిమ్ సలహాదారు కూడా అయిన జాంగ్ ఇటీవల వార్తల్లోని వ్యక్తి అయ్యారు. తన సోదరుడిని విమర్శించేవారిపై విరుచుకుపడ్డారు. కవ్వింపులకు దిగితే సహించబోమని ప్రత్యర్థులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఉభయ కొరియాల మధ్య చర్చలకు వేదికైన అనుసంధాన కార్యాలయాన్ని పేల్చివేసేందుకు ఆదేశాలు కూడా జారీ చేశారు.
ఈ క్రమంలో విదేశాంగ విధానాలలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న కిమ్ యో జాంగ్ పేరు అంతర్జాతీయ మీడియాలోనూ ప్రముఖంగా వినిపించింది. అయితే, సోదరికి వస్తున్న పేరు ప్రఖ్యాతులను చూసి కిమ్ తట్టుకోలేకపోతున్నారంటూ తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. జులై 27 నుంచి జాంగ్ బహిరంగంగా కనిపించకపోవడాన్ని బట్టి చూస్తే ఈ వార్త నిజమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.