అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ మహిళ చరిత్ర సృష్టించారు. ఆమె పేరు కమలా హారిస్. అమెరికా దేశానికి తొలి మహిళా ఉపాధ్యక్షురాలు. ఇపుడు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమల... 2024లో శ్వేతసౌథ అధ్యక్ష పీఠానికి పోటీపడనున్నారు. ఇది కూడా ఓ ఘనతగా చెప్పుకోవచ్చు.
కమలా హారిస్‌కు భారత మూలాలు కలిగిన మహిళ. ఆమె తల్లి తమిళనాడు రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామవాసి. దీంతో ఆ గ్రామంలో ఇపుడు సంబరాలు మిన్నంటాయి. అంతేకాకుండా, కమలా హారీస్ అమెరికాలోని లక్షలాది మంది భారతీయుల కలలను నిజం చేస్తూ విజయభేరీ మోగించారు. ఇప్పటికే కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా, సెనెట్ సభ్యురాలిగా సేవలందించిన కమలా హారిస్ జీవిత విశేషాలను ఓసారి పరికిస్తే...
కమలాహారిస్ 1964, అక్టోబర్ 20న ఓక్లాండ్‌లో జన్మించారు. ఆమె తల్లి తమిళనాడుకు చెందిన ఓ గ్రామానికి చెందిన యువతికాగా, తండ్రి జమైకా దేశస్తుడు. వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు. ఇక, కమలా హారిస్ వాషింగ్టన్‌లోని హోవార్డ్ వర్శిటీలో, యూసీ హేస్టింగ్స్ కాలేజీలో విద్యను అభ్యసించారు. అటార్నీ జనరల్‌గానూ పనిచేశారు.
ఆసమయంలో చిన్నారులపై జరుగుతున్న హింసలకు సంబంధించిన ఎన్నో కేసులను తనదైనశైలిలో వాదించి, పేరు తెచ్చుకున్నారు. ఆపై కమలా హారిస్‍ను గుర్తించిన బరాక్ ఒబామా ఆమెను ప్రోత్సహించడంతో డెమొక్రటిక్ పార్టీలో చేరి, కాలిఫోర్నియా సెనెటర్‌గా ఎన్నికయ్యారు. ఆపై వరుస విజయాలతో ఇప్పుడు బైడెన్‌కు నమ్మకమైన అనుచరురాలిగా, ఉపాధ్యక్ష బాధ్యతలను తీసుకునేందుకు సిద్ధమయ్యారు.