Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడించిన వికీలీక్స్ అధినేత అసాంజేకు విముక్తి!!

Advertiesment
Julian Assange

వరుణ్

, గురువారం, 27 జూన్ 2024 (11:55 IST)
Julian Assange
ఒకపుడు అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడించిన వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజేకు ఎట్టకేలకు విముక్తి లభించింది. అమెరికాతో ఆయన రాజీ పడటంతో ఆయన విడుదలకు మార్గం ఏర్పడింది. దీంతో ఆయన బుధవారం స్వదేశమైన ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. 
 
అమెరికా న్యాయశాఖతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆయన కేసు నుంచి బయటపడ్డారు. అమెరికా ప్రధాన భూభాగంలోని కోర్టుల్లో విచారణ జరిగేందుకు ఆయన ఇష్టపడకపోవడంతో అమెరికా కామన్‌వెల్త్‌ ప్రాంతమైన నార్తరన్‌ మారియానా ద్వీపంలోని సైపాన్‌లో ఉన్న యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో విచారణ జరిగింది. 
 
పసిఫిక్‌ మహాసముద్రంలో ఉన్న ఈ దీవి ఆస్ట్రేలియాకు సమీపంలో ఉండడం గమనార్హం. అమెరికా రక్షణ శాఖకు చెందిన రహస్య పత్రాలను బహిర్గతం చేశారన్న ఆరోపణలు అసాంజేపై ఉన్నాయి. 2006లో స్థాపించిన వికీలీక్స్‌ సంస్థ ద్వారా వీటిని బహిర్గతం చేశారు. 
 
ఇరాక్‌, అఫ్గానిస్థాన్‌ల్లో అమెరికా సైన్యం చేసిన అక్రమాలతోపాటు వివిధ అంశాలపై ఆయన దాదాపు కోటి పత్రాలను వెలుగులోకి తెచ్చారు. ఈ పత్రాల కారణంగానే అమెరికా మిలటరీ అకృత్యాలు ప్రపంచానికి తెలిశాయి. 
 
అసాంజే చర్యలను పత్రికా స్వేచ్ఛను ఆకాంక్షించే వారు స్వాగతించినా అమెరికా ప్రభుత్వం మాత్రం తీవ్రంగా పరిగణించింది. దాంతో అమెరికా నుంచి లండన్‌కు పరారై అక్కడి ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో తలదాచుకున్నారు. చివరకు అయిదేళ్ల పాటు లండన్‌ జైలులో శిక్షను అనుభవించారు. 
 
గత వారం రహస్య విచారణ జరిపిన అక్కడి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దాంతో సోమవారం ఆయన లండన్‌ జైలు నుంచి విడుదలయ్యారు. లండన్‌ నుంచి వచ్చిన తర్వాత అమెరికా కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశాన్ని పొందారు. అమెరికా న్యాయవిభాగంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అసాంజే.. కోర్టులో తన నేరాన్ని అంగీకరించారు. గూఢచర్య చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, ప్రచురించడం వంటి నేరాలకు పాల్పడినట్టు ప్రకటించారు. 
 
సుమారు మూడు గంటల పాటు వాదనలు విన్న జడ్జి రమోనా వి మంగ్లోనా ఈ నేర అంగీకారాన్ని ఆమోదించారు. లండన్‌ జైలులో గడిపిన కాలాన్ని శిక్షగా పరిగణిస్తూ ఆయనను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంకా అదనపు శిక్ష అవసరం లేదని తెలిపారు. అనంతరం అసాంజే ప్రత్యేక విమానంలో అమెరికా, బ్రిటన్‌ల్లోని ఆస్ట్రేలియా రాయబారులతో కలిసి కాన్‌బెర్రా చేరుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కామారెడ్డి: రోడ్డుపై చిరుత పులి.. కారు బోల్తా.. మహిళ మృతి