గత కొన్ని రోజులుగా వరుసగా విమానాలలో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. ఇవి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. జూన్ 30వ తేదీన షాంఘే నుంచి టోక్యో బయలుదేరిన జపాన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 విమానంలో సాంకేతికలోపం తలెత్తిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
అయితే, పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జూన్ 30వ తేదీన చైనాలోని షాంఘై నుంచి జపాన్ రాజధాని టోక్యోకు బయలుదేరిన జపాన్ ఎయిర్‌లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం అకస్మాత్తుగా 26 వేల అడుగుల ఎత్తు నుంచి 10500 అడుగుల కిందకి దిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ప్రయాణికులు స్పృహ కోల్పోయే ప్రమాదం ఉండటంతో వెంటనే స్పందించిన సిబ్బంది వారికి ఆక్సిజన్ మాస్కులు పెట్టుకునే సదుపాయం ఏర్పాటుచేశారు. ఈ ఘటన సమయంలో విమానంలో సిబ్బంది ప్రయాణికులు సహా మొత్తం 191మంది ఉన్నట్టు సమాచారం.
విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్టు పైలెట్ సమాచారం ఇవ్వడంతో విమానం కూలిపోతుందనే భయంతో ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులకు తమ ఆస్తులు, బీమాలకు సంబంధించిన వివరాలు, వీలునామా పత్రాలు మెసేజ్ చేశారు. పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు అత్యవసర పరిస్థితిని వివరించడంతో దానిని జపాన్‌లోని ఒసాకాలోని కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు.
అనంతరం విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులకు విమానాశ్రయంలో వసతి కల్పించిన అనంతరం వారిని వేరే విమానాల్లో తమ గమ్యస్థానాలకు చేర్చినట్టు అధికారులు తెలిపారు. సాంకేతిక లోపం తలెత్తడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.