మన తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కరువైన వేళ.. తమిళనాడు నీటి ఎద్దడి తీవ్రతరమైన తరుణంలో వర్షం పడటం కాదు.. డబ్బు వర్షం కురిస్తే పరిస్థితి ఎలా వుంటుందో ఒక్క ఊహించుకోండి. సూపర్‌గా వుంటుంది కదా.. అయితే ఇక్కడ ఊహ కాదు. నిజమే జరిగింది. డబ్బుల వర్షం కురిస్తే ఎలా వుంటుందో.. ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చు.
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని జార్జియా ప్రావిన్స్‌లోని అట్లాంటాలోని రోడ్డుపై ఎక్కడా చూసినా ఆ దేశ కరెన్సీ నోట్లు కనిపించాయి. గాలికి ఎగురుతూ.. రోడ్డు మొత్తం డబ్బుల వర్షం కురిసినట్లు కనిపించింది. ఈ కరెన్సీని చూసిన జనం వాహనాలను ఆపి మరీ డబ్బులు ఏరుకున్నారు.
ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు జరిపిన విచారణలో డబ్బుతో కూడిన ఓ ట్రక్‌లోని డోర్ అనూహ్యంగా తెరవడంతో అందులోని 68లక్షల మొత్తం రోడ్డు పాలైందని.. దీంతో ఆ రోడ్డుపై ప్రయాణించిన వారు కరెన్సీని ఏరుకున్నారని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.