Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రధాని ప్రసంగిస్తుండగానే కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం!

Advertiesment
pakistan flag

ఠాగూర్

, ఆదివారం, 11 మే 2025 (13:11 IST)
భారత్‌ సాగిన యుద్ధానికి తెరపడిన తర్వాత పాకిస్థాన్ దేశ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. దీంతో పాకిస్థాన్‌లోని ప్రజాస్వామ్య ప్రభుత్వానికి, పాక్ సైన్యానికి ఏమాత్రం సయోధ్య లేదని మరోమారు నిరూపితమైంది. 
 
నిజానికి భారతదేశంతో ఉద్రిక్తతల వేళ ప్రధాని షహబాజ్ షరీఫ్, సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ మధ్య విభేదాలు బయటపడిన విషయం తెల్సిందే. ఓవైపు కాల్పుల విరమణకు అంగీకరించి, మధ్యవర్తిత్వం చేసిన దేశాలకు షరీఫ్ ధన్యవాదాలు చెబుతుండగా.. మరోవైపు, పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. శ్రీనగర్‌లో డ్రోన్ దాడికి పాల్పడింది. దీంతో అసలు పాకిస్థాన్‌ను పాలిస్తోంది ప్రధానా లేక సైన్యాధ్యక్షుడా అనే సందేహాలు రేకెత్తుతున్నాయి.
 
శనివారం సాయంత్రం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే పాకిస్థాన్ నుంచి 'కాల్' వచ్చినట్లు భారత్ కూడా ధృవీకరించింది. దీంతో ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే, ఈ ఒప్పందం ఎంతోసేపు నిలవలేదు.
 
కాల్పుల విరమణ జరిగిన కొన్ని గంటలకే పాకిస్థాన్ సైన్యం డ్రోన్ల ద్వారా పౌర ప్రాంతాలపై దాడికి పాల్పడింది. పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహ్‌బాజ్ షరీఫ్, "ప్రాంతీయ శాంతి కోసం అమెరికా చొరవ చూపినందుకు" కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. రాత్రి 8:38 గంటలకు ఆయన ఈ సందేశం పంచుకోగా, ఆ తర్వాత కొద్ది నిమిషాలకే పాక్ సైన్యం సరిహద్దు మీదుగా డ్రోన్లను పంపి దాడులకు తెగబడింది.
 
పాకిస్థాన్ నుంచి వచ్చిన ఈ రెండు పరస్పర విరుద్ధమైన చర్యలు ఆ దేశంపై నమ్మకం ఉంచలేమని నిరూపించాయి. గతంలో కూడా పాకిస్థాన్‌లో పాలకపక్షానికి, సైన్యానికి మధ్య విభేదాలు తలెత్తిన సందర్భాలు, సైనిక తిరుగుబాట్లు జరిగిన చరిత్ర ఉంది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు కూడా కఠిన వైఖరి కలిగిన వ్యక్తిగా పేరుంది. భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో కీలక నిర్ణయాలు మునీర్ తీసుకుంటున్నట్లు సమాచారం. పహల్గాం దాడికి కొద్ది రోజుల ముందు కూడా కాశ్మీర్‌ను పాకిస్థాన్ "జీవనాడి" అని మునీర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ఉగ్రవాదులను రెచ్చగొట్టాయని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)