భారతీయ వృత్తి నిపుణులకు శుభవార్త. తమ దేశంలో ఉద్యోగ అవకాశాలు విస్తారంగా ఉన్నాయని, వృత్తి నిపుణులైన భారతీయులకు ఇదే తమ ఆహ్వానం అంటూ బ్రిటన్ పిలుపునిచ్చింది. మరోవైపు, అమెరికా మాత్రం అక్కడ పని చేస్తున్న భారతీయ ఉద్యోగులతో పాటు కొత్త ఉద్యోగ వేటలో ఉన్న నిరుద్యోగులకు మాత్రం తమ దేశానికి రావొద్దని అంటోంది.
ఇటీవల అమెరికా హెచ్1బి వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసిన విషయం తెల్సిందే. దీంతో అమెరికాలో ఉద్యోగం అనే మాట ఇక మరిచిపోవాల్సిందే. అదేసమయంలో బ్రిటన్ మాత్రం తమ దేశంలో ఉద్యోగ ఉవకాశాల కోసం వృత్తి నిపుణులైన భారతీయులకు ఆహ్వానం పలుకుతోంది.
ఇందులోభాగంగా యూరోపియన్ యూనియన్‌లోని 27 దేశాలతో సమానంగా భారతీయ నిపుణులకు వీసాలు మంజూరు చేయాలని బ్రిటన్ నిర్ణయించింది. ఈ నిర్ణయం చాలా మంచిదని వృత్తి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇందుకోసం వలస వ్యవస్థలో సమూల మార్పులు చేయనున్నారు. ఇందులో భాగంగా, అత్యంత నిపుణులైన వారి వలసలపై ఇప్పటివరకు ఉన్న పరిమితిని ఎత్తివేయనుంది. దీంతో ఇప్పటివరకు యేడాదికి 20700 వర్క్ వీసాలు మాత్రమే జారీ చేయాలనే నిబంధనను పూర్తిగా తొలగించనున్నారు. ఇది బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో 40 యేళ్ళలో అతిపెద్ద మార్పుగా చెప్పవచ్చు.