భారత్ - చైనా దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. గత జూన్ నెల 15వ తేదీన తూర్పు లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో చైనా బలగాలు బరితెగింపు చర్యల కారణంగా 21 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. అప్పటినుంచి ఇరు దేశాల మధ్య సరిహద్దు ఘర్షణలు కొనసాగుతున్నాయి.
ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సైనికుల మధ్య జరిగిన చర్చల కారణంగా లడఖ్ నుంచి చైనా బలగాలు ఉపసంహరించుకున్నాయి. అక్కడ నుంచి లిపు లేక్‌కు చైనా బలగాలు తరలించాయి. అక్కడే తిష్టవేశాయి. అదేసమయంలో పాన్‌గాంగ్ సరస్సు ప్రాంతం నుంచి తమ దళాలను ఉపసంహరించేది లేదని చైనాకు భారత్ తేల్చిచెప్పింది. ఈస్ట్రన్ లడాఖ్‌లో ఉద్రిక్తతలు తగ్గించే నేపథ్యంలో రెండు దేశాల సైనిక అధికారులు మధ్య చర్చలు జరుగుతున్నాయి.
గతసమావేశంలో చైనా ఓ డిమాండ్ పెట్టింది. దాన్ని భారత దళాలు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఫింగర్-3 వద్ద ఉన్న ధాన్ సింగ్ థప్పా పోస్టు నుంచి భారత దళాలు వెనక్కి జరగాలని చైనా డిమాండ్ చేసింది. కానీ చైనా చేసిన అభ్యర్థనను భారత్ తిరస్కరించింది. ఫింగర్-3 వద్ద ఉన్న పోస్టు భారత భూభాగంలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం కమాండర్ స్థాయి చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో పాన్‌గాంగ్ సరస్సు వద్ద దళాలు అలాగే ఉండిపోయాయి.
ఒకప్పుడు భారతీయ దళాలు పెట్రోలింగ్ చేసిన ప్రాంతంలో ఇప్పుడు చైనా దళాలు ఆక్రమించినట్లు తెలుస్తోంది. పాన్‌గాంగ్ సరస్సు నుంచి చైనా దళాలను వెనక్కి పంపేందుకు మరోసారి ఆ దేశంతో చర్చలు నిర్వహించాల్సి ఉంటుందని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు.
గాల్వన్ దాడి ఘటన తర్వాత చైనా, భారత సైనిక అధికారుల మధ్య ఐదుసార్లు చర్చలు జరిగాయి. దీప్‌సాంగ్ ప్లేయిన్స్, గోగ్రా, పాన్‌గాంగ్ ఫింగర్ ప్రాంతాల్లో ఇంకా చైనా దళాలు తిష్టవేసి ఉన్నాయి. ఫింగర్ ఫోర్ నుంచి ఫింగర్ 8 వద్ద మధ్య ఉన్న దళాలను చైనా ఉపసంహరించుకోవాలని భారత్ ఒత్తిడి తెస్తూనే ఉన్నది.