సరిహద్దుల్లో నిరంతరం లొల్లిపెడుతున్న చైనాతో అమీతుమి తేల్చుకునేందుకు భారత్ సిద్ధమైపోయింది. చైనాతో ఏ క్షణమైనా తలపడేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ వెల్లడించారు.
గత కొన్ని రోజులుగా భారత్ - చైనా దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో చైనా దుందుడుకు చర్యలకు ధీటుగా ప్రతిస్పందించేందుకు భారత ఆర్మీ సర్వసన్నద్ధమైంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో చైనా సైన్యాన్ని నిలువరించింది. తూర్పు లడఖ్‌లోని కొన్ని ప్రాంతాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నించగా భారత్ అప్రమత్తమై అడ్డుకుంది.
దీనిపై భారత త్రిదళాధిపతి (సీడీఎస్) బిపిన్ రావత్ స్పందిస్తూ... చైనాకు తగిన రీతిలో బదులిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. అణు యుద్ధం నుంచి సంప్రదాయ యుద్ధాల వరకు దేశం ఎన్నో సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. వాటిన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టేందుకు సాయుధ బలగాలు సంసిద్ధంగా ఉన్నాయన్నారు.
టిబెట్‌లోని తమ స్థావరాలతో సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పనలో చైనా చర్యలను భారత్ నిశితంగా గమనిస్తోందని చెప్పారు. ఒకవేళ చైనాతో సరిహద్దు వివాదాన్ని ఆసరాగా తీసుకుని పాక్ దుస్సాహసానికి దిగితే ఆ దేశం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు.
సరిహద్దుల వద్ద ప్రమాదాలను ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు చైనా ఆర్థిక సహాయం అందిస్తోందని, పాక్‌కు సైనిక, దౌత్యపరంగా మద్దతు ఇస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ కుట్రలన్నింటినీ సమర్థంగా తిప్పి కొట్టగల శక్తి భారత్‌కు ఉందని బిపిన్ రావత్ స్పష్టం చేశారు.