అగ్ర రాజ్యంలో తదుపరి అధ్యక్ష పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారో ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వెలువడిన ఫలితాల ప్రకారం వెనుకబడ్డారు. ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అయితే ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌కి చేరువగా బిడెన్ చేరుకోగా... గెలుపు తనదేనని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అందుకు తగ్గట్లు బిడెన్‌కు భద్రతను పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బిడెన్ భద్రతను పెంచేందుకు అమెరికా సీక్రెట్ సర్వీసు సంస్థ అధికారులను పంపినట్లు స్థానిక పత్రిక వాషింగ్టన్ పోస్టు తెలిపింది.
మరికొద్ది సేపట్లో బిడెన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారని సమాచారం. దీంతో ఆయనకు భద్రత పెంచేందుకు సీక్రెట్ సర్వీస్ ఏర్పాట్లు చేస్తోందని, ఈ ప్రణాళికల్లో భాగమైన ఇద్దరు అధికారులు చెప్పినట్లు సదరు పత్రిక వెల్లడించింది.
ప్రసంగానికి విల్మింగ్టన్ సెంటర్‌ను వినియోగించుకునే అవకాశం ఉందని బిడెన్ ప్రచార వర్గం సీక్రెట్ సర్వీసుకు సమాచారం ఇచ్చిందని, ఆ మేరకు ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.