చింత చచ్చినా పులుపు చావలేదనే సామెత వుంది. ఇప్పుడు పాకిస్తాన్ దేశ ప్రధానమంత్రి పరిస్థితి కూడా అలాగే వున్నట్లు కనబడుతోంది. ఒకవైపు కీలకమైన స్థావరాలను కోల్పోవడమే కాకుండా అంతర్యుద్ధాన్ని సైతం చవిచూస్తున్న పాకిస్తాన్ తన వైఖరి మార్చుకోవడంలేదు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ చేతిలో బిక్కచచ్చి ప్రపంచ దేశాల కాళ్లూగెడ్డాలు పట్టుకున్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మళ్లీ యుద్ధం గురించి మాట్లాడారు.
భారత్ దాడిలో నాశనమైన రోడ్డు మార్గంలో దుమ్ములో పయనించి బుధవారం నాడు సియాల్ కోట్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు. అక్కడ సిబ్బందితో మాట్లాడుతూ... భారతదేశం మళ్లీ యుద్ధం మాటెత్తితే ఇక వారికేమీ మిగలదనీ, సర్వస్వం కోల్పోతారంటూ చెవాకులు పేలారు. 1971 నాటి ఓటమికి ఇప్పుడు భారతదేశం పైన పగ తీర్చుకున్నామంటూ చెప్పుకున్నారు.
నరేంద్ర మోడీ యుద్ధానికి సై అంటే తాము కూడా సై అంటామని, ఐతే శాంతియుత చర్చలకు తమ దేశం సిద్ధంగా వుందని అన్నారు. సింధు జలాలు, కాశ్మీర్ అంశంపై చర్చించుకుని పరిష్కాలను ఇరువర్గాలు అన్వేషించాలని చెప్పుకొచ్చారు. సింధు జలాల విషయంలో భారత్ మొండి పట్టుదలకు పోతే తమకు ఏం చేయాలో బాగా తెలుసు అంటూ వెల్లడించారు.