ప్రియురాలితో ప్రియుడి గొడవలు మామూలే. అలా ప్రేయసి పిలిపించిందని వెళ్లిన పాపానికి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అమెరికాలోని హోస్టన్ డౌన్ టౌన్‌లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఆస్కార్ అల్వరాడో (17) అనే యువకుడు.. అనాబెల్ లోపెజ్ (17) అనే యువతితో ప్రేమలో వున్నాడు. అనాబెల్ ఫోన్ చేసి ఆహ్వానించడంతో.. ఆమె ఇంటికి వెళ్లాడు.
కానీ ఇంటికెళ్లినా అనాబెల్ ఆస్కార్‌ను పట్టించుకోకుండా ఫోన్ చూస్తూ గడిపేయడంతో విసుగు చెందాడు. అలా అనాబెల్ నీళ్లు తాగేందుకు వెళ్తే.. ఆమె ఫోన్‌ను దాచేశాడు. అంతే వచ్చి వెతుక్కున్న అనాబెల్.. ప్రియుడు నవ్వడంతో ఆగ్రహానికి లోనైంది. అంతటితో ఆగకుండా పక్కనే వున్న గన్ తీసుకుని గురిపెట్టి ఫోన్ ఇవ్వకపోతే.. కాల్చి పారేస్తాననంటూ.. గురిపెట్టింది. ప్రేయసి ఏదో సరాదాగా అలా చేస్తుందనుకున్న ఆస్కార్‌కు ఆ రోజే చివరి రోజని తెలియకపోయింది. ఎంతసేపటికీ ఫోన్ ఇవ్వకపోవడంతో షూట్ చేసేసింది.
తుపాకీ గుండు అతని భుజంలోంచి గుండెల్లోకి దూసుకెళ్లింది. క్షణాల్లో ఆస్కార్ ప్రాణం గాలిలో కలిసిపోయింది. కేవలం ఫోన్ కోసం ఆటపట్టించిన ప్రియుడినే అనాబెల్ పొట్టనబెట్టుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. విచారణలో అనాబెల్ ఆ గన్‌లో గుళ్లు లేవనుకుని పేల్చానని చెప్తుంది.