శత్రుదేశమైన పాకిస్థాన్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులకు మాత్రమే కాదు.. ఆ దేశంలోని హిందూ దేవాలయాలకు కూడా కూడా రక్షణ లేకుండా పోయింది. తాజాగా సింధ్ ప్రావిన్స్‌లోని కాష్మోరే ప్రాంతంలోని ఓ హిందూ దేవాలయంలోని బంగారు ఆభరణాలు, హుండీలోని నగదును దోచుకునేందుకు కొందరు దోపిడీదారులు రాకెట్ లాంఛర్లతో దాడికి తెగబడ్డారు. ఆదివారం ఉదయం ఉన్నట్టుండి ఈ దాడి జరిగింది. ఇది స్థానకంగా కలకలం సృష్టించింది. అయితే, అదృష్టవశాత్తు రాకెట్లేవి పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకునేలోపు దోపిడీదారులు పారిపోయారు.
ఈ దాడిలో దాదాపు పది మంది వరకు పాలుపంచుకున్నట్టు సమాచారం. ఈ దాడికి ముందు ఈ దోపిడీదారులు ఇష్టారీతిన కాల్పులకు తెగబడ్డారు. ఆ తర్వాత రాకెట్ లాంఛర్లతో దాడికి తెగబడ్డారు. పోలీసుల రాకను పసిగట్టిన దోపిడీ దొంగలు అక్కడ నుంచి పారిపోయారు. ఈ దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఆలయంలో స్థానికంగా నివసించే బాగ్రీ వర్గానికి చెందిన ప్రజలు ప్రతి యేటా ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.
ఇదిలావుంటే, పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదరాబ్ జిఖ్రానీ పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన భారత్‌కు చెందిన హిందూ వ్యక్తితో ప్రేమలో పడగా, అతని కోసం అడ్డదారిన సరిహద్దులను దాటుకుని భారత్‌లో అడుగుపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమె, ఆమె ప్రియుడు బెయిలుపై విడుదలయ్యారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌లోని హిందువులపై బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఈ బెందిరింపుల్లో భాగంగానే ఈ హిందూ దేవాలయంపై దాడి జరిగినట్టుగా తెలుస్తుంది.