తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజవర్గంలోని బూర్గుల శివారులోగల శ్రీనాథ్ రోటో ప్యాక్ కంపెనీలో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరు షాద్ నగరులోని కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించగా, మిగిలిన వారిని సికింద్రాబాద్, హైదరాబాద్ నగరాల్లో ఉన్న గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు తరలించారు.
బాధితుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కంపెనీలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు.
యువతిపై సామూహిక అత్యాచారం..,
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసుతో సంబంధం ఉన్న నలుగురు నిందితుల్లో ఒకరు బీజేపీ నేత కుమారుడని పోలీసులు గుర్తించారు. ఈ కామాంధులు... యువతి సోదరి, మైనర్ బాలికపైనా లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన బాధిత యువతి ఆత్మహత్యకు యత్నించింది. తమపై జరిగిన దారుణంపై బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఓ యువకుడితోపాటు ఇద్దరు మైనర్లను అరెస్టు చేశారు.
అయితే, నిందితులందర్నీ అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధితుల బంధువులు, స్థానికులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించడంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిందితుల్లో భాజపా ఆఫీస్ బేరర్ కుమారుడి (మైనర్) పేరు ఉండటంతో రాజకీయంగానూ ఇది తీవ్ర దుమారం రేపుతోంది.
'తనతోపాటు తన సోదరిని నలుగురు యువకులు అపహరించారు. అనంతరం ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ సోదరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తననూ లైంగికంగా వేధించారు' అని శుక్రవారం నాడు బాలిక తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు జిల్లా ఎస్పీ ప్రదీప్ శర్మ వెల్లడించారు.
అనంతరం ఇరువురు ఇంటికి చేరుకున్న తర్వాత.. బాధిత యువతి ఆత్మహత్యకు ప్రయత్నించిందన్నారు. ప్రస్తుతం ఆమె ఝాన్సీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని.. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్యాంగ్‌రేప్, పోక్సోతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని.. నాలుగో వ్యక్తి ఆచూకీ చెప్పిన వారికి రూ.10వేల రివార్డును ప్రకటించామన్నారు.
దీనిపై స్థానిక భాజపా కార్యవర్గం స్పందించింది. ఆ ఘటన దురదృష్టకరమని దతియా జిల్లా భాజపా అధ్యక్షుడు సురేంద్ర బుధోలియా పేర్కొన్నారు. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తమ పార్టీ నేత కుమారుడి పేరు ఉన్నట్లయితే సదరు వ్యక్తికి నోటీసులు ఇచ్చి.. చర్యలు తీసుకుంటామని తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ప్రాతినిధ్యం వహిస్తోన్న దతియా నియోజకవర్గంలో ఈ గ్యాంగ్ రేప్ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.