బ్రిటన్‌కు చెందిన మ్యాక్స్ వూజీ అనే పదేళ్ళ బాలుడు ఓ ఆసుపత్రి స్వచ్ఛంద సంస్థకు నిధులు సమకూర్చడం కోసం సరికొత్త పంథా ఎంచుకున్నాడు. రోజూ రాత్రి పూట ఇంట్లో కాకుండా బయట టెంట్ వేసుకొని నిద్రపోయాడు. అలా మూడేళ్లపాటు నిర్విరామంగా దీన్ని కొనసాగించాడు. తద్వారా దాదాపు రూ.ఏడు కోట్ల నిధులు విరాళంగా వచ్చాయి.
మ్యాక్స్ ఇంటి పక్కన గతంలో రిక్ అబాట్ అనే వ్యక్తి నివసించేవారు. ఆయన 74ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో చనిపోయారు. అంతకుముందే రిక్ తన దగ్గరున్న టెంట్‌ను మ్యాక్స్‌కు ఇచ్చారు. దీంతో ఏదైనా సాహస కార్యం చేయమని ఆయన చెప్పిన మాటలు మ్యాక్స్‌లో స్ఫూర్తి నింపాయి. దాంతో 2020 మార్చిలో ఆరుబయట టెంట్‌లో నిద్రించాలని నిర్ణయం తీసుకున్నట్లు మ్యాక్స్ మీడియాకు తెలిపాడు.
ఇలా చేయడం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వాలనుకున్నట్లు ప్రకటించాడు. అప్పటి నుంచి మ్యాక్స్‌ను ప్రోత్సహిస్తూ పలువురు తనకు విరాళాలు పంపించారు. ఆ మొత్తం ఇప్పుడు దాదాపు రూ.7 కోట్లకు చేరింది. మ్యాక్స్ తన మూడేళ్ల టెంట్ నిద్రకు ముగింపుగా ఏప్రిల్ 1న ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుచేశాడు. ఆ టికెట్ల విక్రయం ద్వారా వచ్చిన డబ్బును స్వచ్ఛంద సంస్థకు పంపిస్తానని తెలిపాడు.