ఓ మహిళపై మాజీ భాగస్వామి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. భాగస్వామితో విడిపోయిన తర్వాత ఆమె ప్రైవేటు ఫొటోలను ఆన్‌లైన్‌లో పెట్టి అవమానాలకు గురిచేయడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడ సరైన న్యాయం జరగలేదని భావించి.. సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ సివిల్ దావాపై విచారణ పూర్తిచేసిన ప్రత్యేక న్యాయమూర్తుల బృందం... బాధిత మహిళకు 1.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.9900 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది.
తాజాగా వెలువడిన ఈ కోర్టు తీర్పు ఫలితాలను పరిశీలిస్తే, అమెరికాకు చెందిన ఓ మహిళ (మొదటి పేరు డీఎల్ అని మాత్రమే పేర్కొంది) మార్క్వెస్ జమాల్ జాక్సన్ అనే వ్యక్తితో 2016 నుంచి కలిసి జీవించారు. షికాగోలో కొంతకాలం గడిపిన తర్వాత అక్టోబరు 2021న పరస్పర అంగీకారంతో వారిద్దరూ విడిపోయారు.
ఆ తర్వాత నుంచి మాజీ ప్రియుడి నుంచి వేధింపులు మొదలయ్యాయి. మాజీ భాగస్వామిని అవమానించడమే లక్ష్యంగా పెట్టుకున్న అతడు.. గతంలో ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను శృంగార సైట్లలో పెట్టాడు. దీంతోపాటు ఆమె ఇంట్లోని సీసీ కెమెరాలు, మొబైల్, ఈ-మెయిల్ నుంచి వ్యక్తిగత ఫొటోలను సేకరించి.. ఆమె అనుమతి లేకుండా సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలను సృష్టించి అందులో పోస్టు చేశాడు.
ఆ ఫొటోల లింకులను అమ్మాయి స్నేహితులు, కుటుంబ సభ్యులకూ పంపించ సాగాడు. 'వాటిని ఇంటర్నెట్ నుంచి తీసివేయడానికి ప్రయత్నించినా.. అందుకు మీ జీవితం సరిపోదు' అంటూ మాజీ భాగస్వామికి మెసేజ్‌లు పంపించేవాడు. మాజీ భాగస్వామి చేష్టలతో విసుగు చెందిన ఆ మహిళ చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై 2022 ఏప్రిల్‌లో టెక్సాస్‌లోని హ్యారీస్ కౌంటీ సివిల్ కోర్టులో దావా వేశారు.
ఇరుపక్షాల వాదనలు విన్న జ్యూరీ.. మహిళను మానసికంగా వేధించినందుకు 200 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1600కోట్లు)తోపాటు ఆమెకు నష్టాన్ని కలిగించినందుకు శిక్షగా మరో బిలియన్ డాలర్లు (సుమారు రూ.8300 కోట్లు) చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై బాధిత మహిళ మాట్లాడుతూ.. వేధింపుల విషయమై స్థానిక పోలీసులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వారినుంచి సరైన సహకారం లభించకపోవడంతోనే సివిల్ కోర్టును ఆశ్రయించినట్లు మీడియాతో పేర్కొన్నారు.