కుక్కని పోలిన అడవి జంతువు నక్క. రాత్రివేళ సంచరిస్తూ ఆహారాన్ని సేకరించే నక్క పిల్లకి కుక్క పిల్లకి పెద్దగా తేడా తెలియదు. అలా ఓ ఫ్యామిలీ కుక్క అనుకుని పెంచుకుంటే.. కొన్ని రోజుల తర్వాత అది నక్కగా తేలింది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతుంది. మరి ఈ ఘటన దక్షిణ అమెరికాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ అమెరికా దేశం పెరూ రాజధాని లిమాలో ఉండే ఓ ఫ్యామిలీ ఓ కుక్క పిల్లను కొన్నారు. అది ఒంటినిండా జూలుతో చాలా బుజ్జిగా, అందంగా ఉండటంతో ఆ కుక్క పిల్ల ఫ్యామిలీలో అందరికీ తెగ నచ్చేసింది. మిగతా కుక్కల లాగా కాకుండా… ఇది కాస్త వరైటీ జాతిదిలా ఉందనీ… ఇలాంటి కుక్క పిల్ల చుట్టుపక్కల ఎవరికీ లేదని ఆ ఫ్యామిలీ చాలా సంబరపడిపోయింది. అది ఎప్పుడూ చాలా చలాకీగా అటూ ఇటూ పరుగులు పెడుతూ ఉండటంతో దానికి రన్ రన్ అని పేరు కూడా పెట్టారు. చట్టుపక్కల వాళ్లు కూడా దాన్ని చూసి తెగ ముచ్చట పడేవారు. అయితే ఓ 6 నెలల తర్వాత అది కుక్క కాదని తెలిసి ఖంగు తిన్నారు.
కొన్నాళ్లకి ఆ తర్వాత రన్ రన్… పరుగులు పెడుతూ… చుట్టుపక్కల వాళ్లు పెంచుకుంటున్న కోళ్లు, బాతుల్ని వెంటాడి, వేటాడి తినడం మొదలుపెట్టింది. దాంతో పొరుగువాళ్లనుంచి ఫిర్యాదులు ఎక్కువయ్యాయి ఈ ఫ్యామిలీకి. అనుకోకుండా ఇలా జరుగుతోంది అనుకున్న వీళ్లు… పరిహారం కూడా చెల్లించారు.
కానీ ఇదే రిపీట్ అవ్వడం వారికి అనుమానం కలిగించింది. ఆ తర్వాత ఓ రోజు అది రాత్రివేళ నక్కలా అరిచింది. అలా అరవడంతోనే… చుట్టుపక్కల కుక్కలు దానిపై ఫైర్ అయ్యాయి. అప్పుడు ఆ ఫ్యామిలీకి లైట్ వెలిగింది. ఇన్నాళ్లూ తాము పెంచుకున్నది కుక్క కాదనీ… నక్క అని అర్థమైంది. వెంటనే దాన్ని బంధించారు. నక్కేమైనా తెలివి తక్కువదా…. అక్కడినుంచి తప్పించుకుని పారిపోయింది. దాని కోసం పెరూలో అధికారులు వెతుకుతున్నారు. అది దొరికితే…జూకి తరలించాలని చూస్తున్నారు.