భారత్కు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోమారు వార్నింగ్ ఇచ్చారు. తమ భద్రతకు ముప్పు వాటిల్లితే మేం పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగుతాం.. అపుడు అక్కడ మరెవరూ ఉండరు అంటూ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్లో ఉగ్రవాదాన్ని భారత్ ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. నిషేధిత తహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్, బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ వంటి సంస్థలు భారత్కు కిరాయి సైనికులుగా, ప్రతినిధులుగా పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మా సరిహద్దులకు ఇరువైపులా శత్రువులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు దేశాలు ఏ క్షణమైనా యుద్ధానికి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ, తమ దేశ భద్రతకు ఏమాత్రం ముప్పు వాటిల్లినా లేదా భారత్ తమపై దాడికి పాల్పడినా చరిత్రలో నిలిచిపోయేలా తీవ్రంగా ప్రతిస్పందిస్తామని, ఆ తర్వాత అక్కడ ఎవరూ మిగలరని ఆయన హెచ్చరించారు.
కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి భారత్ ఎపుడైనా సైనిక చర్యకు పాల్పడవచ్చని ఆయన హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాని మోడీ ఈ ప్రాంతాన్ని అణుయుద్ధం అంచుకు నెట్టేస్తున్నారని, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ఉగ్రవాదంలో న్యూఢిల్లీ ప్రమేయం ఉందని ఆయన పునరుద్ఘాటించారు.