కరోనా ప్రభావం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. సాధారణ ప్రజల నుంచి దేశాధినేతల వరకు అన్ని వర్గాల వారిని రకరకాలుగా ముప్పుతిప్పలు పెడుతోంది. మరీ ముఖ్యంగా ఈ మహమ్మారి డెన్మార్క్ ప్రధానిని ఇరకాటంలో పెట్టేస్తోంది. ఆమె పెళ్లి పీటలెక్కకుండా మూడుసార్లు ఇరుకున పెట్టేసింది.
డెన్మార్క్ ప్రధాని మెట్టె ప్రెడ్రిక్‌సన్ తన పెళ్లిని మూడవసారి వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఫేస్‌బుక్ పేజీలో రాసుకొచ్చారు. తనకు కాబోయే భర్తతో దిగిన ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఆమె.. ‘ఇతన్ని పెళ్లి చేసుకోవాలని చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను. కానీ అది ఇప్పట్లో జరిగేటట్లు లేదు.
మేము జూలైలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న రోజే.. బ్రస్సెల్స్‌లో జరిగే యూరోపియన్ కౌన్సిల్ సమావేశానికి హాజరుకావాల్సి వస్తోంది. దేశ ప్రయోజనాల కోసం.. నేను నా వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నాను. కానీ త్వరలోనే మేము పెళ్లి చేసుకుంటాం. నిన్ను పెళ్లాడటానికి ఎదురుచూస్తున్న బో(కాబోయే భర్త పేరు) ’ అంటూ రాసుకొచ్చారు.
కాగా.. జూలై 17-18 తేదీల్లో బ్రస్సెల్స్‌లో యూరోపియన్ కౌన్సిల్ సమావేశం ఉంది. ఈ సమావేశంలో దాదాపు 27 దేశాల ప్రధానులు పాల్గొని, కొవిడ్-19 నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.