నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా వరదలు, కొండచరియలు విరిగిపడ్డ సంఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 88కి చేరింది. పలు ప్రాంతాల్లో మరో 11 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు.
మంత్రిత్వ శాఖ విపత్తు నిర్వహణ విభాగం ప్రకటించిన వివరాల ప్రకారం.. ఆయా సంఘటనల్లో ఇప్పటి వరకు 30 మంది గల్లంతయ్యారు. తూర్పు నేపాల్‌లోని పంచతార్‌లో అత్యధికంగా 27 మరణాలు నమోదయ్యాయి.
ఇలం, దోతి జిల్లాల్లో 13 మంది మృత్యువాతపడ్డారు. కలికోట్, బైతాడి, దడెల్ధురా, బజాంగ్, హుమ్లా, సోలుఖుంబు, ప్యూథాన్, ధన్‌కుట, మొరాంగ్, సున్సారీ, ఉదయపూర్‌తో సహా 15 ఇతర జిల్లాలో జనం వర్షాలతో మృతి చెందారు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటెత్తుతున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
ఇదిలా ఉండగా.. హుమ్లా జిల్లాలో చిక్కుకున్న విదేశీ పర్యాటకులను వెంటనే రక్షించాలని నేపాల్ పోలీస్, సాయుధ పోలీస్ ఫోర్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్, ఆర్మీని ఆ దేశ హోంమంత్రి బాలకృష్ణ ఖండ్ ఆదేశించారు.
నలుగురు స్లోవేనియన్ టూరిస్టులు, ముగ్గురు గైడ్‌లతో సహా 12 మంది నఖ్లా వద్ద చిక్కుకుపోయారు. లిమిలో టెక్కింగ్ పూర్తి చేసిన తర్వాత సిమికోట్ తిరిగి వెళ్తుండగా చిక్కుకుపోయారని హుమ్లా ముఖ్య జిల్లా అధికారి గణేశ్ ఆచార్య పేర్కొన్నారు.