ఇండియాలో మీడియాకు పూర్తి స్వేచ్ఛ ఉందని బౌద్ధ గురువు దలైలామా అన్నారు. చైనా విద్యార్థులు, యువత.. ఇండియా నుంచి ఎంతో నేర్చుకోవాలని అన్నారు.
ఘ్రువాన్‌లోని చండీగఢ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన గురునానక్ 550వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇండియా వైవిధ్యాన్ని, గొప్పతనాన్ని గురించి విద్యార్థులకు వివరించారు. అంతే కాకుండా చైనాలో ప్రజా గొంతుపై ఆంక్షలు ఏ విధంగా ఉంటాయో తెలిపారు.
‘‘చైనాలో దారుణమైన పరిస్థితి గురించి చెబుతాను. చైనాలో మీడియా పూర్తిగా ప్రభుత్వం కనుసన్నల్లో పని చేస్తుంది. ప్రజల కోసం కాకుండా ప్రభుత్వ అవసరాల నిమిత్తం మీడియా పని చేస్తుంది. ఇండియాలో మీడియాకు పూర్తి స్వేచ్ఛ ఉంది. చైనా విద్యార్థులు ఇండియాకు వచ్చి ఇక్కడి ప్రజాస్వామ్యం ఎంత విజయవంతంగా పని చేస్తుందో తెలుసుకోవాలి.
అవసరమైతే ఇక్కడి విద్యాలయాల్లో చదువుకొంటూ ఇండియా గొప్పతనం తెలుసుకోవాలి. వారికి ఇక్కడి విద్యాలయాలు స్వాగతం చెప్పాలి’’ అని 84 ఏళ్ల దలైలామా అన్నారు. ‘‘దేశంలో జరిగే ఒకటి రెండు సంఘటనలను పట్టించుకోవద్దు. ఇండియా పూర్తిగా సెక్యూలర్ దేశం. మత సామరస్య భావనలతో ఏర్పడిన దేశం ఇది’’ అని అన్నారు.
ఇక పాకిస్తాన్‌పై స్పందిస్తూ ‘‘పాక్ ప్రధాని ఇమ్రాన్‌కు కాస్త ఆవేశం ఎక్కువ. దాన్ని తగ్గించుకుని ఆలోచనను ఎక్కువ పెంచుకుంటే మంచింది. ఎంత లేదన్నా ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ఇండియానే పాక్‌కు అవసరం’’ అని అన్నారు.
ఇక చైనా, ఇండియాలపై చెబుతూ ‘‘ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాలు చైనా, ఇండియా. ఈ రెండు దేశాలకు ఒకదాని అవసరం మరొకదానికి తప్పక ఉంది. ఇరు దేశాలు సహకారంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొన్నారు.