టోక్యో పారాలింపిక్స్ ఆదివారం ఆనందోత్సాహాల నడుమ ముగిసాయి. ఆదివారం రాత్రి నేషనల్ స్టేడియంలో ఘనంగా జరిరిగిన ముగింపు వేడుకల్లో జపాన్ కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలతో అలరించారు. తరువాత వివిధ దేశాల అథ్లెట్ల బృందాలు పరేడ్ నిర్వహించాయి. భారత బృందానికి అవని లేఖరా పతకధారిణిగా వ్యవహరించింది. ఈ వేడుకలకు సాధారణ ప్రజలను అనుమతించలేదు. అధికారులు, ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు.
ముగింపు కార్యక్రమం సందర్భంగా ఐపిసి అధ్యక్షులు, టోక్యో ఆర్గనైజేషన్ కమిటీ చీఫ్ అండ్రూ పర్సన్స్ మాట్లాడుతూ.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 86 దేశాల బృందాలు ఈ గేమ్స్‌లో పాల్గన్నాయని చెప్పారు. టోక్యో గవర్నర్ యురికో కోకై పారాలింపిక్స్ జెండాను పర్సన్స్‌కు అప్పగించగా, 2024 గేమ్స్ జరిగే పారిస్ మేయర్ అన్నే హిడల్గోకు పర్సన్స్ అందజేశారు. చైనా 96 స్వర్ణాలతో సహా 207 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా, రష్యా తరువాత స్థానంలో ఉన్నాయి.
భారత్ చివరి రోజు రెండు పతకాలతో ఏకంగా 19 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. ఇందులో ఐదు బంగారు, ఎనిమిది రజత, ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి. గత 2016 రియో ఒలింపిక్స్‌లో సాధించిన అత్యధిక పతకాలు (4)ను భారత్ అధిగమించింది. ఈసారి భారత్ 54 మందితో కూడిన బృందంతో బరిలోకి దిగింది.
భవినాబెన్ పటేల్ (టేబుల్ టెన్నిస్)లో రజతంతో బోణీ కొట్టగా చివరి రోజున ఆదివారం కృష్ణ నాగర్ బంగారు పతకంతో (బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్‌హెచ్‌ా6)తో భారత పోరును ముగించాడు. ఈ గేమ్స్‌లో 19 పతకాలతో పారాలింపిక్స్‌లో భారత్ మొత్తంగా సాధించిన పతకాల సంఖ్య 31కు చేరుకుంది.