చైనా తీరు ఏమాత్రం మారడం లేదు. భారత్‌తో కయ్యానికి నిత్యం కాలుదువ్వుతూ ఉంది. తాజాగా భారత సరిహద్దుల వద్దకు మళ్లీ సైనిక బలగాలను భారీగా తరలించింది. సరిహద్దుల వద్దకు మళ్లీ చైనా సైన్యం విన్యాసాలు ప్రారంభించింది.
ఓవైపు భారత్ కరోనాతో అల్లాడిపోతోన్న సమయంలో చైనా ఈ తీరును ప్రదర్శిస్తుండడం గమనార్హం. తూర్పు లఢఖ్ సెక్టార్‌కు సమీపంలో చైనా సైనిక విన్యాసాలు చేస్తుండడాన్ని భారత్ గుర్తించింది.
చైనా సైన్యం తీరును నిశితంగా పరిశీలిస్తోంది. సరిహద్దుల మీదుగా కొన్ని గంటల్లోనే భారత్‌లోకి ప్రవేశించేందుకు వీలు ఉన్న ప్రాంతాల్లో చైనా సైన్యం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
అంతేగాక, ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులను చైనా అభివృద్ధి పరుచుకుంటోంది. గత ఏడాది ఇదే సమయంలో చైనా-భారత్ సైన్యాలు తూర్పు లఢఖ్ ప్రాంతంలో భారీగా మోహరించిన విషయం తెలిసిందే. అనేక దశల చర్చల అనంతరం ఇరు దేశాల సైనికులు వెనక్కి వెళ్లారు. అయితే, చైనా మళ్లీ తన బుద్ధిని చూపిస్తుండడం గమనార్హం.
గతంలో కూడా భారత్ - చైనా దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ముఖ్యంగా, ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారత జవాన్లు 22 మంది వరకు మృత్యువాతపడితే పీపుల్స్ ఆర్మీ వైపున 30 మంది వరకు చనిపోయినట్టు వార్తలు వచ్చాయి.