అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌లో కార్చిచ్చు మరింత వేగంగా వ్యాపిస్తుంది. తాజాగా మృతుల సంఖ్య 16కు చేరింది. ఒక్క ఎటోన్ ఫైర్లోనే 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు. తీవ్రమైన గాలులు వీస్తుండటంతో మంటలు ఒక చోట నుంచి మరోచోటుకు వేగంగా వ్యాపిస్తున్నాయి.
పాలిసేడ్స్ ఫైర్‌ను 11 శాతం అదుపు చేయగలిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది బ్రెంట్ వుడ్ వైపు మళ్లినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోనే లిబ్రోన్ జేమ్స్, ఆర్నాల్డ్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నివాసాలు ఉన్నాయి. ఇక్కడి పరిస్థితి కారణంగా ఆమె తన చిట్టచివరి విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇక మరోవైపు ఎటోన్ ఫైర్ మాత్రం కట్టడి కాలేదు.
మరోవైపు, అగ్రరాజ్యం అమెరికాలో అత్యంత దుర్భర పరిస్థితులు ఏర్పడివున్నాయి. ఈ కారణంగా 1100 విమాన సర్వీసులను నిలిపివేసినట్టు డెల్టా ఎయిర్ లైన్స్ వెల్లడించింది. అటు డాలస్‌లోని ఫోర్ట్ వర్త్ ఎయిర్ పోర్టు, నార్త్ కరోలినాలోని చార్లోటే డగ్లస్ ఎయిర్ పోర్టులోనూ ఇంచుమించు ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ఈ రెండు ఎయిర్ పోర్టుల నుంచి 1,200 విమాన సర్వీసులు రద్దయ్యాయి.
మంచు తుఫాను కారణంగా అమెరికాలో ఇప్పటిదాకా ఐదుగురు మరణించారు. అమెరికాలోని మధ్య భాగాలు, తూర్పు రాష్ట్రాల్లో చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో మైనస్ 18 డిగ్రీల సెల్సియస్ లకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.