తమను టచ్ చేస్తే విరుచుకుపడతాం అంటూ... ఇరాన్‌కు అమెరికాకు హెచ్చరించింది. ఇదే అంశంపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ హెచ్చరిక చేశారు. గత కొన్ని రోజులుగా ఇరాన్ - అమెరికా దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న విషయం తెల్సిందే. హెచ్చరికలు, జవాబులతో పరిస్థితి మరింత వేడెక్కింది. మళ్లీ దాడులకు తెగబడితే ఇరాన్‌పై కనీవినీ ఎరుగని రీతిలో దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అయితే, అమెరికాకు అంత దుమ్ములేదని ఇరాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ రహీం బదులిచ్చారు.
ఇరాన్ ఎంపీ ఒకరు ఏకంగా శ్వేతసౌధంపైనే దాడి చేస్తామని హెచ్చరించడం గమనార్హం. శనివారం రాత్రి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఎలాంటి దాడులకు పాల్పడినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ‘‘ఇరాన్‌లోని 52 కీలక ప్రాంతాలను గుర్తించాం. వాటిలో కొన్ని ఇరాన్‌కు, ఆ దేశ సంస్కృతికి అత్యంత ప్రధానమైనవి కూడా ఉన్నాయి. అమెరికా పౌరులు, ఆస్తులపై ఇరాన్ దాడికి పాల్పడితే ఆ 52 లక్ష్యాలపై దాడులు తప్పవు’’ అని ట్రంప్ హెచ్చరించారు.
చాలా ఏళ్ల కిందట ఇరాన్ 52 మంది అమెరికన్లను నిర్బంధించిన విషయాన్ని గుర్తుచేస్తూ ట్రంప్ 52 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించడం గమనార్హం. ‘‘వాళ్లు(ఇరాన్) మాపై దాడి చేశారు. మేం ప్రతి దాడి చేశాం. ప్రతీకార దాడులు వద్దని చెప్పా. అయినా అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకున్నామని చాలా ధైర్యంగా చెబుతున్నారు. ఒకవేళ వాళ్లు మళ్లీ దాడికి పాల్పడితే మాత్రం ఇంతకుముందెన్నడూ చేయని రీతిలో ప్రతిదాడి చేస్తాం’’ అని ట్విటర్‌లో హెచ్చరించారు.