అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ కోసం తాము జరుపుతున్న ప్రయోగాల ఫలితాలు ఆశించిన స్థాయిలో వస్తున్నాయని, త్వరలోనే శుభవార్త చెబుతామని ఆయన వెల్లడించారు. పైగా, ఇతర దేశాలతో పోల్చితే తమవద్దే అతిపెద్ద కోవిడ్ పరీక్షా సామర్థ్యం కేంద్రం ఉందని చెప్పుకొచ్చారు.
కరోనా వైరస్ బాధిత దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. దీనిపై ఆయన మాట్లాడుతూ, కరోనాకు వ్యతిరేకంగా గొప్పగా పనిచేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే మంచి శుభవార్తను అందించబోతున్నామన్నారు. రష్యా, చైనా, భారత్, బ్రెజిల్ వంటి దేశాల కంటే తమ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ పరీక్ష సామర్థ్యం ఉందన్నారు.
తాము భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించడం వల్లే పెద్ద సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయన్న ట్రంప్.. ఇప్పటివరకు 45 మిలియన్ల పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. అన్ని పరీక్షలు చేయబట్టే ఎక్కువ కేసులు వెలుగు చూశాయన్నారు.
కొన్ని దేశాలు తమలా కాదని, అనారోగ్యంతో ఉన్నవారు, ఆసుపత్రికి వచ్చిన వారికి మాత్రమే పరీక్షలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఆయా దేశాల్లో కేసులు ఎక్కువగా లేకపోవడానికి ఇదే కారణమన్నారు.
తమకు కేసుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున పరిస్థితి కత్తిమీద సాములా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, మరణాల రేటు మాత్రం తమ వద్దే తక్కువని, తాము కొవిడ్‌కు వ్యతిరేకంగా గొప్పగా పోరాడుతున్నామని పేర్కొన్నారు.
వ్యాక్సిన్‌ల ఫలితాలు బాగా వస్తున్నాయని, ఫలితంగా చికిత్స విధానంలో మంచి మార్పులు రాబోతున్నాయని ఆశిస్తున్నట్టు చెప్పిన అధ్యక్షుడు.. త్వరలోనే మంచి వార్తను అందించబోతున్నట్టు చెప్పారు.