భారత్‌లోకి కరోనా వైరస్ ప్రబలే ప్రమాదం వుందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆప్ఘనిస్థాన్ నుంచి భారత్‌లోకి కరోనా వ్యాపించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చైనాను కుదిపేసిన కరోనా వైరస్ ఆసియా దేశాలకు మెల్ల మెల్లగా పాకుతోంది. మొన్నటికి మొన్న దాయాది దేశమైన పాకిస్థాన్‌కు సోకింది.
ఇంకా ఆప్ఘన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించే అవకాశం వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆఫ్ఘన్ వాసులకు వైద్య, వాణిజ్య వీసాలు మంజూరు చేయడమే ఇందుకు కారణమని వైద్యులు అంటున్నారు. ప్రతి నెల వంద మందికి పైగా ఆఫ్ఘన్ రోగులు వైద్యం కోసం దేశ రాజధానికి ఢిల్లీకి వస్తున్నారు. అయితే, ఆఫ్ఘన్‌లో బుధవారం ఓ కరోనా కేసు నమోదైనప్పటికీ.. భారత ప్రభుత్వం ఆ దేశంపై ఇలాంటి ఆంక్షలు విధించడం లేదు.
ప్రస్తుతం చైనా అవతల ఇరాన్‌లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. యాత్రికుల ద్వారా వైరస్ ఇరాన్ నుంచి సౌదీ అరేబియా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌కు పాకింది. ప్రస్తుతం మనుషుల నుంచి మనుషులకు వైరస్ విస్తరిస్తోంది. ఫలితంగా ఆప్ఘనిస్థాన్ నుంచి వచ్చే రోగుల్లో ఎవరిలోనైనా కరోనా వైరస్ ఉంటే అది మన దేశంలోనూ విస్తరించే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఆఫ్ఘన్ ప్రయాణికులపై కూడా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించాల్సి ఉందని భావిస్తున్నారు.